: కేసీఆర్ ఇంటి ముందు ధర్నా చేస్తాం: పొన్నం ప్రభాకర్
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి కేసీఆర్ గాలికొదిలేశారని... ఒక్కటి కూడా నెరవేర్చలేదని కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ విమర్శించారు. ఆసరా పించన్లు తప్ప ఇతర హామీలు అమలుకు నోచుకోలేదని అన్నారు. కరీంనగర్ లో ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ, ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ జిల్లాలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తామని చెప్పారని... కానీ, రెండేళ్లైనా ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోయారని తెలిపారు. ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాలని... లేకపోతే, ముఖ్యమంత్రి, మంత్రుల ఇళ్ల ముందు ధర్నా చేపడతామని హెచ్చరించారు. కొత్త జిల్లాల ప్రారంభోత్సవాలకు ఇతర పార్టీలను, ప్రజాసంఘాలను ఎందుకు ఆహ్వానించలేదని ప్రశ్నించారు.