: ఢిల్లీలో భేటీ అయిన కేంద్ర కేబినెట్.. ఆమోదం తెలిపిన కీలక అంశాలు ఇవే!
పలు అంశాలకు ఆమోదం తెలపడమే లక్ష్యంగా న్యూఢిల్లీలో ఈ రోజు కేంద్ర కేబినెట్ భేటీ అయింది. అందులో జమ్ముకశ్మీర్‌లో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్థాపనకు ఆమోదం తెలిపింది. గతంలో ప్రధాని ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీలో భాగంగా ఐఐఎం ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు గానూ రూ.61.9 కోట్లను కేటాయించింది. 2020 నాటికి నిర్మాణం పూర్తి చేయనుంది. రష్యాతో ఇండియా కుదుర్చుకున్న ద్వైపాక్షిక సంబంధాల సహకారంలో భాగంగా కుదిరిన ఎంవోయూకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఇండియా, హంగేరీ మధ్య కుదిరిన వాటర్ మేనేజ్ మెంట్ సహకార ఎంవోయూకు కూడా కేంద్ర కేబినెట్ పచ్చజెండా ఊపింది. జార్ఖండ్, బీహార్ మధ్య 4 లైన్ల రహదారుల వంతెనల నిర్మాణానికి నిర్ణయం తీసుకుంది. గంగానదిపై 33 కిలోమీటర్ల మేర నూతన రహదారులు, వంతెనలు నిర్మించాలని నిర్ణయించింది. ఆమోదం పొందిన మరిన్ని అంశాలు.. * ఇంధన సరఫరా, ధరలపై వ్యవహరించాల్సిన విధానానికి ఆమోదం * ఇథనాల్ ఉత్పత్తిదారులకు ప్రోత్సాహం ఇచ్చేలా నిర్ణాయక ధరకు ఆమోదం * క్రీడల అభివృద్ధికి భారత్-ఖతార్ ద్వైపాక్షిక ఒప్పందానికి ఆమోదం.