: 800 చెట్లను నరికి రూ. 1800 కోట్లతో వంతెన... వద్దే వద్దంటున్న బెంగళూరు వాసులు!


బెంగళూరు విమానాశ్రయానికి మరింత సులువుగా ప్రయాణికులను చేరవేసేందుకు ప్రభుత్వం ప్రతిపాదించిన ఓ వంతెన ప్రాజెక్టుపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. దాదాపు రూ. 1800 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించతలపెట్టిన ఈ ఉక్కు వంతెన కోసం దాదాపు 800 చెట్లను నరికివేయాల్సి వుండటమే ఇందుకు కారణం. ఇప్పటికే ఈ బ్రిడ్జ్ వద్దని పలువురు బెంగళూరు వాసులు హైకోర్టును ఆశ్రయించారు. బెంగళూరులోని బసవేశ్వర సర్కిల్ నుంచి హెబ్బల్ వరకూ 6.72 కిలోమీటర్ల దూరం వంతెన నిర్మించేందుకు ప్రభుత్వం ప్రతిపాదించగా, దీన్ని వ్యతిరేకిస్తూ, ఆదివారం నాడు భారీ మానవ హారాన్ని ఏర్పాటు చేసి నిరసనలు తెలపాలని ప్రజా సంఘాలు నిర్ణయించాయి. నగరంలో ట్రాఫిక్ జామ్ లను నివారించడంతో పాటు, ప్రధాన కేజే జార్జ్ రహదారిపై వాహనాల రాకపోకలు తగ్గేందుకు ఈ నూతన బ్రిడ్జ్ ఉపకరిస్తుందని ప్రభుత్వం అంటోంది. వచ్చే పదేళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ ప్లాన్ వేశామని, కూల్చేసే 812 వృక్షాల స్థానంలో 60 వేల మొక్కలు నాటుతామని ప్రభుత్వం చెబుతుంటే, పర్యావరణానికి తీవ్ర విఘాతం కలిగించే నిర్మాణాలు వద్దని, ప్రత్యామ్నాయాలు చూసుకోవాలని పలు ఎన్జీవోలు డిమాండ్ చేస్తున్నాయి.

  • Loading...

More Telugu News