: కళ్లు మూసుకొని ధ్యానంలో, తెరుచుకొని ఊహల్లో తిరుమల శ్రీవారిని చూడాలి: బ్రహ్మానందం
తిరుమల తిరుపతి శ్రీవారి బ్రహ్మోత్సవాలు చూడాలంటే రెండు కళ్లు చాలవని కామెడీ కింగ్ బ్రహ్మానందం అన్నారు. తాజాగా మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల గురించి ఆయన మాట్లాడారు. బ్రహ్మోత్సవాలను ప్రత్యక్షంగా తిలకిస్తే ఆ అనుభూతే వేరని అన్నారు. మరీ ముఖ్యంగా గరుడోత్సవం రోజున శ్రీవారిని చూడాలని తాను ఎన్నోసార్లు అనుకున్నా తన బిజీ లైఫ్ వల్ల సాధ్యంకాలేదని తెలిపారు. పూర్వం శ్రీవారికి నెలకొకసారి చొప్పున బ్రహ్మోత్సవాలు జరిగేవని తాను విన్నట్లు బ్రహ్మానందం పేర్కొన్నారు. దేవతలందరూ చేరి వేంకటేశ్వరుడిని స్తుతించే వేడుక బ్రహ్మోత్సవాలని ఆయన అభివర్ణించారు. వైఖానస ఆగమోక్తంగా నిర్వహించే ఒక్కో ఉత్సవంలో శ్రీవారి దివ్య తేజోమూర్తి వైభవం ఒక్కో రకంగా ఉంటుందని ఆయన చెప్పారు. స్వామివారు నిత్యనూతనంగా ఆయన భక్తులకి కనపడుతూ వారిలో భక్తిని నింపుతారని ఆయన అన్నారు. తాను వేంకటాచల మహాత్మ్యం చదివానని, ఆ సమయంలో ఆకాశరాజు కుమార్తె పద్మావతిదేవితో శ్రీనివాసుడి పెళ్లి కళ్లకు కట్టినట్లు కనిపించిందని ఆయన పేర్కొన్నారు. అన్నమయ్య, వెంగమాంబ వంటి భక్తులు వేంకటేశ్వరుడిని కీర్తించి ఎంతో పుణ్యం చేసుకున్నారని బ్రహ్మానందం అన్నారు. ఏడు కొండలపై కొలువైన శ్రీవారిని దర్శించుకోవడం ఆయన లడ్డూ ప్రసాదాన్ని స్వీకరించడం గొప్ప అనుభూతని ఆయన అభివర్ణించారు. తాను ఎన్నో సార్లు శ్రీవారిని దర్శించినట్లు ఆయన చెప్పారు. కోరిన కోర్కెలను వెంటనే తీర్చే దేవుడు వేంకటేశ్వరుడని అన్నారు. తనకు సమయం దొరికినప్పుడల్లా తిరుమల వెళతానని అన్నారు. దేవుడిని ఎలా ప్రార్థించినా ఆయన కరుణిస్తారని బ్రహ్మానందం అన్నారు. కళ్లు మూసుకొని ధ్యానంలో, తెరుచుకొని ఊహల్లో ఆయనను చూడాలని వ్యాఖ్యానించారు. ఆయనను తలుచుకుంటే మనస్సుకు ప్రశాంతత లభిస్తుందని చెప్పారు.