: దేశం పరువు తీస్తున్న మసూద్, హఫీజ్ లపై చర్యలు తీసుకోవడం చేతగాక మాకు పాఠాలా?: ప్రభుత్వాన్ని ప్రశ్నించిన పాక్ దినపత్రిక


దేశ భద్రతకు విఘాతంగా మారడంతో పాటు, అంతర్జాతీయ స్థాయిలో పాకిస్థాన్ పరువు తీస్తున్న జైషే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజర్, జమాతే ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయీద్ లపై సైన్యం, ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రముఖ పాక్ పత్రిక 'ది నేషన్' తన సంపాదకీయంలో ప్రశ్నించింది. పాక్ సైన్యం, ప్రభుత్వం మధ్య విభేదాలున్నాయని 'డాన్' పత్రిక జర్నలిస్టు సిరిల్ అల్ మైడా ప్రత్యేక కథనాన్ని రాసిన తరువాత, ఆయన దేశం విడిచి వెళ్లకుండా ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఈ సంపాదకీయం ప్రచురితం కావడం గమనార్హం. హక్కానీ నెట్ వర్క్, తాలిబాన్లు, లష్కరే తోయిబా వంటి సంస్థలకు సైన్యం కోవర్టు మద్దతిస్తోందని ఆరోపించిన పత్రిక, అజర్, సయీద్ వంటి వారిపై చర్యలు తీసుకోవడం మానేసి పత్రికలకు పాఠాలు చెబుతోందని ఆరోపించింది. కాగా, పఠాన్ కోట్ ఉగ్రదాడి మాస్టర్ మైండ్ మసూద్ అజర్, 2008 ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ లు పాకిస్థాన్ లో స్వేచ్ఛగా తిరుగుతున్న సంగతి తెలిసిందే. వీరికి పాక్ సైన్యమే భద్రతను కల్పిస్తోందన్న విషయమూ బహిరంగ రహస్యమే. ఈ విషయంలో తమ విధిని పక్కనబెట్టిన ప్రభుత్వం, సైన్యం మీడియా చేయాల్సిన పనులపై పాఠాలు చెప్పాలని చూడటం భావ్యం కాదని 'ది నేషన్' అభిప్రాయపడింది.

  • Loading...

More Telugu News