: దసరాకు 'పండుగ' చేసుకున్నారు.. రూ.106 కోట్లు తాగేసిన మందుబాబులు!
దసరా పండుగ సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్‌లో మద్యం అమ్మకాలు నింగికెగిశాయి. నాలుగు రోజుల్లో ఏకంగా రూ.106 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. ఆదివారం నుంచి వరుసగా నాలుగు రోజులు సెలవులు రావడంతో మద్యం విక్రయాలు అమాంతం పెరిగాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 590 బార్లు, 400 వరకు ఉన్న మద్యం దుకాణాలు ఈ నాలుగు రోజులు కిటకిటలాడాయి. మొత్తం విక్రయాల్లో బీర్లదే ప్రథమస్థానం. గతేడాదితో పోలిస్తే ఈసారి 13 శాతం అధికంగా విక్రయాలు జరిగినట్టు ఆబ్కారీ శాఖ తెలిపింది. నాలుగు రోజుల్లో రూ.106 కోట్ల మద్యాన్ని తాగేసిన మందుబాబులు రోజుకు రూ.33 కోట్లకు పైగా గుటుక్కుమనిపించారు. నిన్న (బుధవారం) కూడా ఏడు కోట్ల రూపాయల విలువైన మద్యం విక్రయాలు జరిగినట్టు ఆబ్కారీ అధికారులు తెలిపారు. పండుగ సందర్భంగా మొత్తం నాలుగు రోజల్లో రూ.106 కోట్ల మద్యం విక్రయాలు జరిగినట్టు ఆ శాఖాధికారులు తేల్చారు. సాధారణ రోజుల్లో హైదరాబాద్‌లో రోజుకు రూ.10 కోట్ల మద్యం విక్రయాలు జరుగుతుండగా పండుగ రోజుల్లో అంతకు మూడు రెట్లు అధికంగా జరుగుతున్నట్టు పేర్కొన్నారు. ఇక గత నాలుగు రోజుల్లో నగర పరిధిలో 1,31,655 కేసుల బీరు, 1,20,524 కేసుల ఐఎంఎల్ మద్యం అమ్ముడైనట్టు ఆబ్కారీ శాఖ తెలిపింది. పండుగ సందర్భంగా బార్లు ప్రకటించిన ‘రెండు పెగ్గులకు మరో పెగ్గు ఫ్రీ’ ఆఫర్ వల్ల కూడా విక్రయాలు పెరిగినట్టు చెబుతున్నారు.