: నిధుల మళ్లింపు, మోసం కేసులో రాకియా మాజీ అధిపతి అరెస్ట్.. జెద్దాలో అదుపులోకి తీసుకున్న పోలీసులు
నిధుల మళ్లింపు, మోసం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాస్ అల్ ఖైమా పెట్టుబడుల సంస్థ(రాకియా) మాజీ అధిపతి ఖజర్ మస్సాద్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. జెద్దా విమానాశ్రయంలో ఆయనను సౌదీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్, ఇండోనేషియా, జార్జియా తదితర దేశాల్లో మస్సాద్ అక్కడి స్థానిక వ్యాపారులతో కుమ్మక్కై అక్రమాలకు పాల్పడ్డారని రాస్ అల్ ఖైమా ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదు మేరకు సౌదీ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. రాస్ అల్ ఖైమా ప్రభుత్వ పెట్టుబడుల సంస్థ రాక్ ఇన్వెస్టిమెంట్ అథారిటీ(రాకియా)కి అధిపతిగా ఉన్న కాలంలో మస్సాద్ పలు అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని, దాదాపు 1.5 బిలియన్ డాలర్లను దోచుకుని దేశం విడిచి పారిపోయారని రాస్ ఆల్ ఖైమా ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. దీంతో మస్సాద్ అరెస్ట్‌కు కోర్టు వారెంట్ జారీ చేసింది. లెబనాన్ దేశీయుడైన మస్సాద్(63) రాస్ అల్ ఖైమా రాజుకు ఒకప్పుడు దగ్గరి సలహాదారుల్లో ఒకరు. ఆరేళ్లపాటు రాకియాకు అధిపతిగా వ్యవహరించారు. ఆ సమయంలో జార్జియాలో జరిగిన ఓ ఒప్పందంలో 17 మిలియన్ డాలర్లను అక్రమ పద్ధతిలో స్విస్ ఖాతాకు మళ్లించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీంతో ప్రభుత్వం ఆయనపై ఫిర్యాదు చేసింది. కాగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఒకప్పుడు రాకియా అవినీతి పతాకస్థాయిలో నిల్చిన సంగతి తెలిసిందే. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో రాస్ అల్ ఖైమా పేరు రాష్ట్రంలో మార్మోగిపోయింది. పత్రికల్లో ప్రధాన శీర్షిక అయింది. ఇందుకు కారణం ఆ దేశం భాగస్వామిగా ఉన్న రాక్ ఇన్వెస్టిమెంట్ అథారిటీకి వైఎస్ సర్కారు వేలాది ఎకరాల భూములు అప్పనంగా కేటాయించడమే.