: నా గమ్యం రాజకీయాలే... ఎంపీ, ఎమ్మెల్యే ఏదో ఒకటి కచ్చితంగా అవుతాను: కోన వెంకట్
తన లక్ష్యం రాజకీయాలేనని సినీ మాటల రచయిత కోన వెంకట్ తెలిపారు. ఓ టీవీ చానెల్ తో ఆయన మాట్లాడుతూ, సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి మళ్లడానికి తన తాత కోన ప్రభాకరరావు ఆదర్శమని అన్నారు. తన తాతే సినిమాల్లో నటించి, రాజకీయాల్లోకి వచ్చారని వెంకట్ చెప్పారు. తనకు కూడా రాజకీయాలంటే చాలా ఇష్టమని అన్నారు. రాజకీయాలను దూరంగా కూర్చుని చూస్తూ ఉండలేనని, ప్రజల్లో కలిసి మమేకమయ్యేందుకు రాజకీయాల్లోకి వస్తానని చెప్పారు. అయితే ఎంపీనవుతానో లేక ఎమ్మెల్యే నవుతానో తెలియదు కానీ, కచ్చితంగా తన భవిష్యత్ మాత్రం రాజకీయాల్లోనే ఉందని అన్నారు. తన సొంత నియోజకవర్గం బాపట్లలో యూత్ నుంచి పెద్దల వరకు తనకు చాలా మంది తెలుసని, వారితో మమేకమవ్వడం తనకు ఆనందమని కోన వెంకట్ వెల్లడించారు.