: రష్యా నుంచి పెట్టుబడులకు ఇదే మంచి సమయం: ముఖ్యమంత్రి చంద్రబాబు
రష్యానుంచి పెట్టుబడులను సాధించడంలో భాగంగా విజయవాడలో రష్యా ప్రతినిధుల బృందంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు చర్చించారు. రష్యా సమాఖ్య పరిశ్రమలు, వాణిజ్య మంత్రి జెనిష్ మ్యాంటురోవ్‌తో కలిసి చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. అమరావతికి రావాలని గతంలో జెనిష్ మ్యాంటురోవ్‌ను ఆహ్వానించానని చంద్రబాబు అన్నారు. ప్రభుత్వ ఆహ్వానం మేరకు మ్యాంటురోవ్ రష్యా పరిశ్రమ ప్రతినిధుల బృందాన్ని అమరావతికి తీసుకొచ్చారని ఆయన చెప్పారు. రాష్ట్రంలో ఐటీ, బయోటెక్నాలజీలో మంచి అవకాశాలున్నాయని ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్ నుంచి రష్యాకు తేయాకు, పొగాకు ఎగుమతి చేస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు. దేశంలో రెండంకెల వృద్ధి సాధించిన రాష్ట్రం ఏపీ ఒక్కటేనని అన్నారు. రాయలసీమలో స్టీల్ ప్లాంట్ పెడితే తాము సహకరిస్తామని చెప్పారు. విశాఖలో ఏరోస్పేస్, రక్షణరంగ పరిశ్రమలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు ఉన్నాయని అన్నారు. ప్రభుత్వంతో ఎంఎంఎస్ రేడార్ కార్పొరేషన్ కలిసి పనిచేయాలని కోరుతున్నట్లు పేర్కొన్నారు. వ్యవసాయ యాంత్రీకరణకు అవకాశాలున్నాయని అన్నారు. రష్యా నుంచి పెట్టుబడులకు ఇదే మంచి సమయమని ఆయన అన్నారు. జెనిష్ మ్యాంటురోవ్ మాట్లాడుతూ... బయోటెక్, ఫార్మా, మైనింగ్ రంగాల్లో పరస్పర సహకారంతో ముందుకెళ్లాలని అన్నారు. ఏపీతో వ్యాపార వాణిజ్య సంబంధాలపై జరిపిన చర్యలు ఫలితాన్నిచ్చాయని చెప్పారు. రెండు ప్రాంతాల్లోని వనరులు, అవకాశాలపై సమగ్రంగా చర్చించామని అన్నారు. ఇరు దేశాలు నౌకా నిర్మాణం, యుద్ధ నౌకల నిర్మాణంలో భాగస్వాములవడం హర్షణీయమని పేర్కొన్నారు.