: ఇక నమ్మాల్సిన టైమొచ్చింది డూడ్... సమయంకన్నా ముందే గమ్యానికి చేరుతున్న 400 రైళ్లు
'మీరెక్కాల్సిన రైలు జీవితకాలం లేటు' అన్న మాట ఇకపై వినిపించబోదేమో. ఇండియాలో రైళ్ల సమయపాలన సిగ్నలింగ్ వ్యవస్థ మెరుగుతో కొత్త పుంతలు తొక్కుతోంది. ఇరుకుగా ఉన్న ప్రాంతాల్లో రైల్వే లైన్ల సంఖ్య పెంచడం, సిగ్నలింగ్ వ్యవస్థలో మరింత ఆటోమేషన్ కారణాలుగా 350 మెయిల్ / ఎక్స్ ప్రెస్ రైళ్లు, 74 వరకూ రాజధాని, శతాబ్ది ఎక్స్ ప్రెస్ రైళ్లు గమ్యస్థానానికి 5 నుంచి 25 నిమిషాల ముందుగానే చేరుకుంటున్నాయి. ఈ విషయాన్ని సీనియర్ రైల్వే అధికారి ఒకరు తెలిపారు. వీటిలో హౌరా, పాట్నా రాజధాని ఎక్స్ ప్రెస్ రైళ్లు, చెన్నై- కోయంబత్తూర్, హౌరా - పూరి ఎక్స్ ప్రెస్ తదితర రైళ్లు ఉన్నాయి. బిజీ రూట్లలో ఆర్ఆర్ఐ (రూట్ రిలే ఇంటర్ లాకింగ్) వ్యవస్థలను అమలు చేస్తుండటంతో ప్రధాన రైల్వే స్టేషన్లలో పని సులువైందని, దీనివల్ల జర్నీ సమయం ఆదా అవుతోందని రైల్వే మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. పూర్తి స్థాయి కంప్యూటర్ నియంత్రణలో ఉండే ఇంటర్ లాకింగ్ వ్యవస్థ ద్వారా రైలు స్టేషన్ కు సమీపిస్తున్న సమయంలో ఏ ప్లాట్ ఫాం ఖాళీగా ఉంది? ఏ ప్లాట్ ఫాంపై రైలు వచ్చే వీలుంది? తదితరాలను రియల్ టైం మానిటరింగ్ చేస్తూ సేవలందిస్తుంది. అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త టైంటేబుల్ లో తగ్గిన సమయాన్ని జోడించామని రైల్వే శాఖ అధికారి తెలిపారు.