: సొంత పార్టీపైనే యుద్ధం ప్రకటించిన ట్రంప్... అభిశంసించేందుకు కదులుతున్న నేతలు!


రిపబ్లికన్ల తరఫున అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న డొనాల్డ్ ట్రంప్ మరిన్ని కష్టాల్లో చిక్కుకున్నారు. సొంత పార్టీ నేతలే పోటీ నుంచి తప్పుకోవాలని చేస్తున్న డిమాండ్ పెరుగుతున్న వేళ ఆయన సొంత పార్టీ నేతలపైనే యుద్ధాన్ని ప్రకటించారు. హౌస్ స్పీకర్ పాల్ డీ ర్యాన్, (విస్కాన్సిన్), సెనెటర్ జాన్ మెక్ కెయిన్ (ఆరిజోనా)లపై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికలకు నాలుగు వారాల ముందు ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. రిపబ్లికన్లలో టాప్ ర్యాంకులో ఉన్నవారు చాలా బలహీనులని, వారి ప్రచారం తనకేమాత్రమూ ఉపయోగపడదని, వారు తనకు మద్దతివ్వడం లేదని ఆరోపించారు. అమెరికన్ల తరఫున తాను యుద్ధం చేస్తున్నానని చెప్పుకున్న ట్రంప్, తనపై వచ్చిన విమర్శలు అర్థరహితమన్నారు. మెక్ కెయిన్ నోటి తీరు సరిగ్గా లేదని, ఒకప్పుడు తన మద్దతు కోసం అడుక్కున్నాడని వ్యాఖ్యానించారు. ఇలాంటి వారి మద్దతు తనకు అవసరం లేదని, ముఖ్యంగా ర్యాన్ వంటి వారితో ఎలాంటి ఉపయోగం లేదని ఫాక్స్ న్యూస్ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. హిల్లరీ కన్నా అననుకూల వ్యాఖ్యలు చేస్తున్న రిపబ్లికన్లు తనకు సమస్యగా మారారని తన ఫేస్ బుక్ ఖాతాలో 1.2 కోట్ల మందికి తెలిపారు. తనను విమర్శించడం ద్వారా వారిని వారే తిట్టుకుంటున్నట్టు ప్రవర్తిస్తున్నారని వ్యాఖ్యానించారు. కాగా, ట్రంప్ గెలవడం కష్టమని భావిస్తున్న రిపబ్లికన్ నేతలు, ఆయన్ను తొలగించాలని భావిస్తూ, అందుకు రాజ్యాంగ పరమైన మార్గాలను అన్వేషిస్తున్నట్టు సమాచారం. మహిళలపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలను 30 మందికి పైగా రిపబ్లికన్ నేతలు తీవ్రంగా పరిగణిస్తున్నామని తెలిపి, ఆయనకు అనుకూలంగా ఓటు వేయబోమని తేల్చిచెప్పారు. మొత్తం 331 మంది సెనెటర్లున్న రిపబ్లికన్లలో సగానికి పైగా ఆయన వైఖరిని విమర్శిస్తుండగా, 220 మంది ట్రంప్ ను వ్యతిరేకిస్తే, ప్రత్యేక సమావేశం పెట్టి ఆయన్ను అభిశంసించ వచ్చని రాజకీయ నిపుణులు వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News