: అక్కడి పిల్లలకు అతను 'శాంటాక్లజ్... ఉగ్రవాదులకు మాత్రం టార్గెట్!
చిన్నపిల్లలంటే అతనికి ఎంతో ఇష్టం.. వాళ్ల ముఖాల్లో ఆనందాన్ని చూడడమంటే ఇంకా ఇష్టం. అతని పేరు రామి అదమ్. 1989లో సిరియా నుంచి ఫిన్లాండ్ కు వలస వెళ్లాడు. అక్కడ అతను బాగానే స్థిరపడ్డాడు. అయితే, 2011 తరువాత తన మాతృదేశం (సిరియా)లో చోటుచేసుకున్న తిరుగుబాట్లతో అక్కడ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని తెలుసుకుని చింతించాడు. దీంతో ఓ సారి తన దేశం వెళ్లి అక్కడి ప్రజలను చూసి రావాలాని అనుకున్నాడు. వెళ్లేటప్పుడు తన కుమార్తెకు చెందిన కొన్ని బొమ్మలు కూయడ తీసుకెళ్లి సిరియాలోని కొంత మంది చిన్నారులకు ఇచ్చాడు. వాటిని తీసుకున్న పిల్లల ముఖాల్లో చెప్పలేని ఆనందాన్ని చూశాడు. అంతర్యుద్ధం, అల్లర్లతో అట్టుడుకుతున్న సిరియాలో పిల్లలు కూడా తీవ్ర ఇబ్బందులు పడడాన్ని గుర్తించాడు. దీంతో వారి కోసం మరిన్ని బొమ్మలు సేకరించి ఇవ్వడం మొదలు పెట్టాడు. తన చేతుల్లోంచి బొమ్మలు తీసుకునే సమయంలో పిల్లల ముఖాల్లోని సంతోషానికి ముగ్ధుడై 'శాంటాక్లజ్' గా మారిపోయాడు. అప్పటి నుంచి ఫిన్లాండ్ లోని హెల్సింకిలో వందలాది బొమ్మలు సేకరించడం, 40 కేజీల బొమ్మల బ్యాగును మొసుకుంటూ ప్రాణాలకు తెగించి టర్కీ, సిరియా సరిహద్దులను దాటడం.. వాటిని సిరియాలోని వివిధ ప్రాంతాల ప్రజలకు పంచడంతో అలెప్పోలో ‘శాంటా ఆఫ్ సిరియా’, ‘టాయ్ స్మగ్లర్’ వంటి పేర్లతో అక్కడివారికి సుపరిచితుడయ్యాడు. కానీ ఈ సేవతో అటు ఐసిస్ కు, ఇటు సిరియా మిలిటెంట్లకు అతను ‘వాంటెడ్’గా మారిపోయాడు. అయినప్పటికీ వెనకడుగు వేయటంలేదు. ‘పిల్లల మొహాల్లో సంతోషం చూడటం కోసం ప్రాణాలు కోల్పోయినా ఫర్వాలేదని చెబుతున్నాడు. బెదిరింపులను తాను లెక్కచేయనని ఆయన స్పష్టం చేశాడు. గత ఐదేళ్లుగా చేస్తున్న ఈ పనిని మీడియా పొగడ్తలతో ముంచెత్తుతోందని, నిజానికి తాను ప్రచారం కోసం ఈ పని చేయట్లేదని, ఇందులో లభించే ఆనందం ఇంకెందులోనూ లభించడం లేదని అంటున్నాడు రామి అదమ్.. సారీ శాంటాక్లజ్!