: బురఖాలో వెళ్లి ఆకతాయిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న డీఎస్పీ సుప్రజ
'కిక్' సినిమా తరహాలో డబుల్ గేమ్ ఆడుతూ ఓ ఆకతాయి పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. వివరాల్లోకి వెళ్తే... నెల్లూరు జిల్లా కొత్తపల్లి మండలం నాగంపల్లి గ్రామానికి చెందిన మధుశేఖర్ కృష్ణా పుష్కరాల్లో వలంటీర్ గా సేవలందించాడు. ఈ సందర్భంగా అక్కడ విధులు నిర్వర్తిస్తున్న పోలీసు అధికారులను పరిచయం చేసుకుని, వారితో సెల్ఫీలు దిగి ఆ ఫోటోలను తన మిత్రులందరికి చూపించి తాను పోలీసు ఇన్ఫార్మర్ నంటూ ప్రచారం చేసుకుని నమ్మించాడు. పుష్కరాల పరిచయంతో వివిధ సందర్భాల్లో చిన్న నేర సమాచారం పోలీసులకు అందజేయడం ద్వారా నమ్మకం పెంచుకున్నాడు. అయితే పోలీసులు ఆ స్థలానికి వచ్చేలోపు నేరగాళ్లకు సమాచారమందించి ఇరువైపులా డ్రామాలు ఆడేవాడు. ఈ వ్యవహారం శ్రుతి మించి యువతులను వేధించడం ప్రారంభించాడు. ప్రధానంగా బస్సుల్లో వెళ్లే విద్యార్థినులను లక్ష్యం చేసుకుని వారితో దురుసుగా వ్యవహరించేవాడు. అంతే కాకుండా, ఓ ప్రజాప్రతినిధి వద్ద పనిచేసే తన సోదరుడి సాయంతో పలువురికి ఉద్యోగాలిప్పిస్తానని చెప్పి వసూళ్లకు దిగాడు. అతని ఆగడాలు భరించేక ఓ యువతి ఆత్మకూరు డీఎస్పీ సుప్రజకు లేఖ రాసింది. అందులో మధుశేఖర్ బారినుంచి కాపాడాలని కోరుకుంది. దీంతో రంగంలోకి దిగిన డీఎస్పీ సుప్రజ నేరుగా బురఖా వేసుకుని బస్సులో ప్రయాణించి, ఆత్మకూరు గౌడ్ సెంటర్ లో ఆకతాయి పనుల్లో బిజీగా ఉన్న మధుశేఖర్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అతనిని అదుపులోకి తీసుకొచ్చి తమదైన శైలిలో కౌన్సిలింగ్ ఇచ్చారు. దీంతో తన ఘనకార్యాల చిట్టా విప్పడంతో సెక్షన్ 420 కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు. ఈ సందర్భంగా పోలీసులు ధరించే డ్రస్, జంగిల్ బూట్లను అతని నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఇలాంటి వారు ఎవరు మోసాలకు పాల్పడినా తమకు తెలపాలని డీఎస్పీ సూచించారు.