: ‘నో మోర్ రూమర్స్’.. జయలలిత ఆరోగ్యంపై ట్విట్టర్‌లో భారీగా ప్రచారం
సెప్టెంబరు 22 నుంచి చెన్నైలోని ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంపై వస్తోన్న పుకార్లను ఖండించేందుకు ఆ రాష్ట్ర అధికార పార్టీ అన్నాడీఎంకే ట్విట్టర్‌లో ప్రచారానికి శ్రీకారం చుట్టింది. 'మై సీఎం ఈజ్ ఫైన్.. నో మోర్ రూమర్స్' అనే హ్యాష్ ట్యాగ్‌లతో ట్విట్టర్‌లో ప్రచారాన్ని ప్రారంభించింది. దీంతో అమ్మ అభిమానులు ట్విట్టర్‌లో ఇదే నినాదంతో ఉన్న ప్రొఫైల్ పిక్చర్లను పెట్టుకుంటున్నారు. జయలలితకు చికిత్స అందించడానికి ఢిల్లీలోని ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుంచి నిపుణులు వచ్చారు. అయితే, దీనిపై అనేక పుకార్లు వచ్చాయి. ఆమె అంతర్గత అవయవాలు చెడిపోయాయని, అందుకే అక్కడి నుంచి నిపుణులు వచ్చారని వదంతులు చెలరేగాయి. ప్రతిపక్షాలు కూడా మొదట్లో విమర్శలు చేశాయి. వీటన్నింటినీ ఖండిస్తూ అన్నాడీఎంకే నేతలు పోస్టులు చేస్తున్నారు.