: రూ. 160 కోట్లుకు 'కింగ్ మేకర్ మార్కెటింగ్'ను అమ్మనున్న ఐటీసీ
సిగరెట్ల నుంచి పలు ఎఫ్ఎంసీజీ బ్రాండ్ ఉత్పత్తుల వరకూ మార్కెటింగ్ చేస్తున్న దిగ్గజ సంస్థ ఐటీసీ, తన యూఎస్ అనుబంధ కంపెనీ 'కింగ్ మేకర్ మార్కెటింగ్' ను 24 మిలియన్ డాలర్లకు (సుమారు రూ. 160 కోట్లు) విక్రయించనుంది. న్యూజర్సీలో రిజిస్టరయిన కింగ్ మేకర్ మార్కెటింగ్ సంస్థ అమెరికాలో ఐటీసీ విక్రయిస్తున్న సిగరెట్లను తయారు చేస్తోంది. ఈ డీల్ కు సంస్థ కార్పొరేట్ నిర్వహణ కమిటీ ఆమోదం లభించినట్టు ఐటీసీ సంస్థ నేడు బీఎస్ఈకి వెల్లడించింది. 8వ తేదీన ఒప్పందం కుదిరిందని, షేర్ పర్చేజ్ అగ్రిమెంట్ అమల్లోకి వచ్చిన నాటి నుంచి కింగ్ మేకర్ మార్కెటింగ్ తో తమ అనుబంధం ముగుస్తుందని పేర్కొంది. కింగ్ మేకర్ మార్కెటింగ్ సంస్థ ఏస్, చెకర్స్, హెచ్ఐ వాల్, గోల్డ్ క్రెస్ట్ వంటి సిగరెట్ ఉత్పత్తులను అందిస్తోంది. ఈ వార్త వెలుగులోకి వచ్చిన అనంతరం ఐటీసీ వాటా విలువ 0.71 శాతం పెరిగి రూ. 240.85 వద్ద ట్రేడవుతోంది.