: తనకేమైందంటూ సైగలతో ప్రశ్నించిన జయలలిత.. సంతోషంలో పార్టీ నేతలు
అస్వస్థతతో గత 18 రోజులుగా చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కోలుకుంటున్నారు. ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు చేస్తున్న చికిత్సతో ఆమె ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోంది. ప్రస్తుతం వెంటిలేటర్‌పై ఉన్న జయలలిత ఆదివారం మధ్యాహ్నం కళ్లు తెరిచి వైద్యులతో నెమ్మదిగా మాట్లాడినట్టు అత్యంత విశ్వసనీయ వర్గాల సమచారం. తనకేమైందంటూ సైగలతో ఆమె వైద్యులను ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఆమె కళ్లు తెరిచి మాట్లాడడంతో అన్నాడీఎంకే పార్టీ నేతలు, కార్యకర్తలు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. జయకు రక్తపోటు, చక్కెర శాతం సాధారణ స్థితికి వచ్చాయని, పరిస్థితి ఇలాగే కొనసాగితే మరో వారం రోజుల్లో ఆమెను డిశ్చార్జి చేసే అవకాశం ఉంటుందని అపోలో ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి. నిన్న పుదుచ్చేరి ముఖ్యమంత్రి వి.నారాయణస్వామి, సీపీఐ నేతలు డి.రాజా, టీఎంసీ అధ్యక్షుడు జీకే వాసన్ తదితరులు అన్నాడీఎంకే సీనియర్ మంత్రులు, వైద్యులతో మాట్లాడి ‘అమ్మ’ ఆరోగ్యం పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. మరోవైపు జయ త్వరగా కోలుకోవాలని తమిళనాడు వ్యాప్తంగా ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.