: సంవత్సరానికొకసారి తద్దినం పెట్టినట్లు చేస్తే కుదరదు!: వెంకయ్యనాయుడు
‘స్వచ్ఛ భారత్’ చాలా పవిత్రమైన కార్యక్రమం అని, మనందరికి ఎంతో అవసరమైన కార్యక్రమం అని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. హైదరాబాద్ సైబర్ సిటీ కన్వెన్షన్ సెంటర్ లో స్వచ్ఛాగ్రహ లఘు చిత్రాల ప్రదర్శన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘స్వచ్ఛ భారత్’ అనేది ప్రతిరోజూ చేయాల్సిన కార్యక్రమం అని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. అలా కాకుండా, సంవత్సరానికొకసారి తద్దినం పెట్టినట్లో, శ్రాద్ధం పెట్టినట్లో, లేకపోతే, వ్రతం చేసినట్లో ఈ కార్యక్రమం చేస్తామంటే కుదరదని అన్నారు. 'మనం రోజూ గడ్డం గీసుకోవాలి కదా. మన గడ్డం మనమే గీసుకోవాలి కదా, లేకపోతే, వేరే వాళ్లకు డబ్బులిచ్చి గీయించుకోవాలి. గవర్నమెంట్ వచ్చి మనకు గడ్డం గీయదు కదా? ఇంకా ఆ స్కీమ్ రాలేదు. భవిష్యత్ లో పెడతారేమో తెలియదు. అక్టోబర్ 2న గడ్డం గీసుకున్నాను.. మళ్లీ వచ్చే అక్టోబర్ 2వరకు గడ్డం గీసుకోనని ఎవరైనా ఉండిపోతే, ఏమవుతుంది!.. సాధువు అయిపోతారు. అందుకని, పరిశుభ్రతనేది ప్రతిఒక్కరి జీవితంలో దినచర్య కావాలి’ అంటూ వెంకయ్యనాయుడు తనదైన శైలిలో చమత్కారాలతో మాట్లాడారు.