: దసరాను క్యాష్ చేసుకుంటున్న ప్రైవేటు వాహనదారులు.. మూడింతల అధిక చార్జీలు వసూలు చేస్తున్న వైనం!
దసరా పండుగను సంతోషంగా జరుపుకునేందుకు ఇంటిబాట పట్టిన నగరవాసులకు అటు ఆర్టీసీ, ఇటు ప్రైవేటు వాహనదారులు ఆ ఆనందాన్ని దూరం చేస్తున్నారు. వరుసగా నాలుగు రోజులు సెలవులు రావడంతో శుక్రవారం నుంచే ప్రజలు పల్లెబాట పట్టారు. ప్రయాణికుల రద్దీని తట్టుకునేందుకు ఆర్టీసీ ప్రత్యేకంగా బస్సులు నడుపుతోంది. అయితే వాస్తవ చార్జీల కంటే 50 శాతం అధికంగా వసూలు చేస్తూ ప్రయాణికుల జేబులు గుల్ల చేస్తోంది. అయినా రద్దీకి సరిపడా బస్సులు నడపకపోవడంతో ప్రయాణికులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సి వస్తోంది. దీంతో వారు సైతం ఇదే అదునుగా భావించి ప్రయాణికుల నుంచి మూడింతల చార్జీలు వసూలు చేస్తున్నారు. ప్రయాణికులతో శనివారం ఉదయం సికింద్రాబాద్‌లోని జేబీఎస్‌కు ప్రయాణికులు పోటెత్తారు. అయితే వారికి సరిపడా బస్సులు లేకపోవడం, గంటల తరబడి బస్సుల కోసం పడిగాపులు కాయాల్సి రావడంతో ఓ దశలో ఆందోళనకు దిగారు. సరిపడా బస్సులు నడపాలని డిమాండ్ చేశారు. దీంతో స్పందించిన అధికారులు కరీంనగర్, మంచిర్యాల రూట్‌లో ఆరు ప్రత్యేక బస్సులు వేశారు. అయితే ప్రత్యేకం పేరుతో ప్రయాణికుల నుంచి 50 శాతం చార్జీలను అధికంగా వసూలు చేశారు. మరోవైపు బస్సులు చాలకపోవడంతో కొందరు ప్రయాణికులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించారు. టాప్‌లపైకి ఎక్కి మరీ ప్రయాణాలు కొనసాగించారు. హైదరాబాద్-విజయవాడ రహదారిపైనా ఇదే పరిస్థితి కనిపించింది. నల్లగొండ జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద దసరా రద్దీ కొట్టొచ్చినట్టు కనిపించింది. ఇక్కడ కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. మొత్తం 16 గేట్లలో పదింటిని హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాలకే కేటాయించారంటే దసరా రద్దీ ఏమేరకు ఉందో అర్థం చేసుకోవచ్చు.