: మానిటర్ ఆన్ చేసే వుంది... అయితే కనపడదు.. ఇది స్పెషల్!: విమర్శకులకు టీడీపీ నేత గద్దె రామ్మోహన్ వివరణ
మానిటర్ కూడా ఆన్ చేయకుండా శ్రద్ధగా టెక్నాలజీ పాఠాలు వింటున్నట్టు కనిపిస్తున్న టీడీపీ మాజీ ఎంపీ గద్దె రామ్మోహన్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, నెటిజన్ల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో గద్దె వివరణ ఇచ్చారు. ఇది కేఎల్ యూనివర్శిటీ వాడుతున్న ప్రత్యేక మానిటర్ అని, 90 డిగ్రీల కోణంలో మాత్రమే కనిపిస్తుందని, యాంగిల్ కాస్తంత మారినా మానిటర్ ఆఫ్ అయినట్టు ఉంటుందని తెలిపారు. ఆన్ లైన్ పరీక్షలు రాసే విద్యార్థులకు ఒకరి మానిటర్ మరొకరికి కనిపించకుండా చేసిన ఏర్పాటని తెలిపారు. మానిటర్ కు సైడ్ యాంగిల్ నుంచి తీసిన ఫోటో కావడం వల్లే ఇది ఆఫ్ అయినట్టు కనిపిస్తోందని, విపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని దుయ్యబట్టారు. తనకు సాయి సుధ అనే విద్యార్థిని శిక్షణ ఇచ్చిందని, ఆ సమయంలో కంప్యూటర్ ఆన్ లోనే ఉందని స్పష్టం చేశారు. అయితే, నేతల శిక్షణకు సంబంధించి తెలుగుదేశం పార్టీ చాలా ఫోటోలను విడుదల చేసింది. వాటిల్లో శిక్షణ తీసుకుంటున్న ఎంతో మంది నేతల చిత్రాలున్నాయి. వాటిల్లో అత్యధికం సైడ్ యాంగిల్ నుంచి తీసినవే. అక్కడ మాత్రం కంప్యూటర్లు ఆన్ అయి ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. వాటి గురించి మాత్రం గద్దె ప్రస్తావించకపోవడం గమనార్హం.