: మహాబతుకమ్మ వేడుకలో విదేశీ మహిళల సందడే సందడి
హైదరాబాద్‌లోని ఎల్బీస్టేడియంలో మహాబతుకమ్మ వేడుకలు ఈరోజు ఘనంగా జరిగాయి. వేడుకలో విదేశీ మహిళలు కూడా సందడి చేశారు. బతుకమ్మలతో వచ్చి ఆడిపాడి, గిన్నిస్ రికార్డు సాధించడంలో పాలు పంచుకున్నారు. మైదానంలో పాడుతున్న బతుకమ్మ పాటలకు వారు సైతం గొంతుకలిపారు. స్టేడియంలో మహిళలు అందరూ కలిసి ఇరవై అడుగుల ఎత్తుతో తీరొక్క పూలతో మహా బతుకమ్మను పేర్చారు. దాని చుట్టూ బతుకమ్మ ఆడడంతో గిన్నిస్ రికార్డు సొంతమయిందని నిర్వాహకులు ప్రకటించగానే మైదానం చప్పట్ల మోతతో మారుమోగిపోయింది. వర్షం వచ్చినా మహిళలు అనుకున్నది సాధించారని నగర మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు. తెలంగాణ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకను తెలంగాణ ప్రచారకర్త, టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా కూడా తిలకించారు.