: జగన్ అక్రమాస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీలక్ష్మికి మళ్లీ పోస్టింగ్
జగన్ అక్రమాస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐఏఎస్ అధికారి ఎర్రా శ్రీలక్ష్మి శుక్రవారం మళ్లీ విధుల్లో చేరారు. తెలంగాణ ప్రభుత్వ రంగ సంస్థల ముఖ్య కార్యదర్శిగా ఆమె బాధ్యతలు స్వీకరించారు. ఓఎంసీ మైనింగ్ కుంభకోణంలో నాలుగో నిందితురాలిగా ఉన్న శ్రీలక్ష్మిని సీబీఐ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. గత కొద్దికాలంగా పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న ఆమె ఇటీవల ఈ విషయంలో కేంద్రానికి సైతం ఫిర్యాదు చేశారు. తెలంగాణ ప్రభుత్వం తనకు పోస్టింగ్ ఇవ్వడం లేదని కేంద్రానికి ఫిర్యాదు చేస్తూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో కేంద్రం జోక్యం చేసుకుంది. కేంద్ర ప్రభుత్వ జోక్యంతోనే తెలంగాణ ప్రభుత్వం ఆమెకు ప్రభుత్వ రంగ సంస్థల ముఖ్య కార్యదర్శిగా పోస్టింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది.