: ఆ బాల్ దెబ్బకు నా పక్కటెముకల్లో ఒకటి విరిగిందనుకున్నా: సచిన్ టెండూల్కర్
‘ఒక రోజు మ్యాచ్ లో బ్యాటింగ్ చేస్తుండగా బాల్ నా పక్కటెముకలకు బలంగా తగిలింది. దెబ్బతగిలిన ప్రదేశంలో ఎముక విరిగిందనుకున్నాను’ అని క్రికెట్ లెజెండ్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ నాటి విషయాలను తాజాగా ప్రస్తావించాడు. న్యూఢిల్లీలోని ఒక కార్యక్రమంలో పాల్గొన్న సచిన్ మాట్లాడుతూ, ‘ఆ మ్యాచ్ లో బాల్ దెబ్బకు ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టమైపోయింది. అయితే, నా బాధ ప్రత్యర్థి బౌలర్ కు ఏమాత్రం కనిపించకుండా జాగ్రత్తపడ్డా. మొండిగా, బ్యాటింగ్ కొనసాగించాను’ అన్నాడు. ఈ సందర్భంగా టీమిండియాపై ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రపంచంలోని మెరుగైన జట్లలో ఒకటిగా టీమిండియా నిలిచిందని, యువ క్రికెటర్లు తమ ఫిట్ నెస్ పై శ్రద్ధ పెట్టాలని సచిన్ సూచించాడు. ఫిట్ నెస్ ను ప్రస్తావించిన సందర్భంలో సచిన్ తనకు సంబంధించిన మరో విషయాన్ని కూడా ప్రస్తావించాడు. తన ఫిట్ నెస్ కాపాడుకోవడంలో రన్నింగ్ అనేది కీలక పాత్ర పోషించిందని, మ్యాచ్ ఆడేటప్పుడు పరుగుల కోసం వికెట్ల మధ్య వేగంగా పరిగెత్తడం, క్రీజ్ ను సమీపిస్తున్న సమయంలో వేగాన్ని తగ్గించడం.. చేస్తుండేవాడినని, అందుకోసం చాలా శ్రమించే వాడినని సచిన్ చెప్పుకొచ్చాడు. కాగా, తన కెరీర్ మొత్తంలో అలా వికెట్ల మధ్య పరుగుల కోసం మొత్తం 353 కిలోమీటర్లు పరిగెత్తానని చెప్పాడు.