: దర్శకుడి వేధింపుల వల్లే ఆత్మహత్యాయత్నం చేశా: హీరోయిన్ అతిథి
దర్శకుడు సెల్వకణ్ణన్ వెంటపడి తనను వేధింపులకు గురి చేశాడని... అందువల్లే తాను ఆత్మహత్యాయత్నం చేశానని హీరోయిన్ అతిథి అలియాస్ అథిరా సంతోష్ తెలిపింది. ఇప్పటికే మలయాళంలో పలు సీరియల్స్ లో నటించిన అతిథి... తమిళంలో 'నెదునల్వాడై' సినిమా ద్వారా వెండితెరకు హీరోయిన్ గా పరిచయం అవుతోంది. ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి డైరెక్టర్ సెల్వకణ్ణన్ తన వెంటపడుతున్నాడని... పెళ్లి చేసుకోవాలని వేధిస్తున్నాడని... తాను ఒప్పుకోకపోవడంతో చంపుతానని బెదిరించాడని వెల్లడించింది. అతని వేధింపులను భరించలేకే సూసైడ్ చేసుకోవాలనుకున్నానని చెప్పింది. సెప్టెంబర్ 28న విషం తాగి అతిథి ఆత్మహత్యాయత్నం చేసింది. అయితే, వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం నుంచి బయటపడింది. జరిగిన దానికి సంబంధించి సెల్వకణ్ణన్ పై నడిగర్ సంఘానికి ఫిర్యాదు చేశానని ఆమె తెలిపింది. అయితే, నడిగర్ సంఘంలో సెల్వకణ్ణన్ సభ్యుడు కాకపోవడంతో... అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేమని సంఘం ప్రధాన కార్యదర్శి విశాల్ చెప్పారని చెప్పింది. ఈ క్రమంలో, సెల్వపై పోలీసులకు ఫిర్యాదు చేశానని చెప్పింది.