: అమెరికా ఎన్నికలే ఇండియాకు పెను సమస్య!: అరుణ్ జైట్లీ కీలక వ్యాఖ్య


ఇండియాలో స్టాక్ మార్కెట్ కు, భవిష్యత్ వృద్ధికి అంతర్జాతీయ స్థాయిలో ప్రతికూల పవనాలు ఏమైనా ఉన్నాయంటే, అది అమెరికా అధ్యక్ష ఎన్నికలు మాత్రమేనని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యానించారు. ఈయూ నుంచి బ్రిటన్ వైదొలగితే వచ్చే నష్టం కన్నా, నవంబర్ ఎన్నికల తరువాత వచ్చే నష్టం అధికంగా ఉండవచ్చని ఆయన అంచనా వేశారు. ఓ టీవీ చానల్ తో మాట్లాడిన ఆయన, భారత వృద్ధి బాట స్పష్టంగా ప్రపంచం ముందు కనిపిస్తున్నందునే విదేశీ పెట్టుబడులు అధికంగా వస్తున్నాయని వివరించారు. ఏ అంతర్జాతీయ అంశం ప్రభావమైనా కనిపించేది స్వల్ప కాలమేనని, ఇండియా అన్నింటినీ తట్టుకుని నిలబడగలుగుతుందని వెల్లడించారు. ప్రపంచ దేశాల్లో పెట్టుబడులు, వృద్ధి వాతావరణం సంతృప్తికరంగా ఉంటే, ఇండియా మరింత వేగంగా ముందడుగు వేస్తుందని తెలిపారు. భారత ప్రైవేటు రంగానికి అనుకున్నంత మేరకు పెట్టుబడులు రావడం లేదని, ప్రైవేటు రంగంలో రుణాల లభ్యత క్లిష్టతరంగా ఉండటమే ఇందుకు కారణమని భావిస్తున్నామని తెలిపారు. సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్టు జైట్లీ వెల్లడించారు. గ్రామీణ భారతావనిలో మౌలిక వసతుల రంగంలోకి మరింత ఇన్వెస్ట్ మెంట్ రావాల్సి వుందని తెలిపిన ఆయన, వివిధ ప్రాజెక్టుల్లో ప్రజలను భాగస్వామ్యం చేసే దిశగా తమ ప్రభుత్వం అడుగులు వేస్తోందని తెలిపారు. రెండేళ్ల కరవు పరిస్థితుల అనంతరం, ఈ సంవత్సరం వర్షాలు సంతృప్తికరంగా ఉన్నాయని, ఇది మరింత జీడీపీకి కారణమవుతోందని తెలిపారు. ప్రపంచ పెద్దన్నగా ఉన్న అమెరికా, ఇప్పుడు స్వీయ రక్షణ ధోరణిలోకి వెళ్లిపోతున్నదని, ఇది చాలా దేశాలపై ప్రభావం చూపే అంశమని అరుణ్ జైట్లీ అభిప్రాయపడ్డారు. అగ్రరాజ్యాల మధ్య ఆధిపత్య పోరు తీవ్రం కానుందని అంచనా వేసిన ఆయన, చైనా వంటి పెద్ద ఆర్థిక వ్యవస్థలు తమ గొడుగు కిందకు చిన్న దేశాలను తెచ్చుకునే ఆలోచనలు చేస్తున్నాయని అన్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఇండియా వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలపై పెను ప్రభావం చూపవచ్చని వివరించారు.

  • Loading...

More Telugu News