: మిరాకిల్ ఎస్కేప్... పెను ప్రమాదం నుంచి బయటపడ్డ జెట్ ఎయిర్ వేస్
246 మందితో లండన్ హీత్రూ విమానాశ్రయం నుంచి ముంబైకి బయలుదేరిన జెట్ ఎయిర్ వేస్ బోయింగ్ 777-300 ఈఆర్ విమానం అద్భుత రీతిలో పెను ప్రమాదం నుంచి బయటపడింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే, విమానం టేకాఫ్ తీసుకునే సమయంలో రన్ వేను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాల్సి వుంటుంది. రన్ వేపై సరిపడా వేగాన్ని విమానం అందుకుందని నిర్ణయించుకున్నాకే టేకాఫ్ చేయాల్సి వుంటుంది. ఒక వేళ, పూర్తి వేగాన్ని అందుకోకుండా టేకాఫ్ చేస్తే, చేరుకోవాల్సినంత ఎత్తునకు విమానం వెళ్లడానికి మరింత సమయం పడుతుంది. విమానయాన రంగంలో ఇది చాలా ప్రమాదకర పరిస్థితి. ముఖ్యంగా బిజీగా ఉండే ఎయిర్ పోర్టుల్లో మోస్ట్ డేంజర్. ఇక ఈ జెట్ విమానాన్ని నడుపుతున్న పైలట్ పూర్తి రన్ వేను వినియోగించుకోకుండా విమానాన్ని టేకాఫ్ చేసి, అధికారుల్లో దడ పుట్టించాడు. విషయాన్ని తీవ్రంగా పరిగణించిన అధికారులు పైలట్ ను విధుల నుంచి తొలగించారు. మొత్తం 231 మంది ప్రయాణికులు 15 మంది సిబ్బంది, ఇద్దరు పైలట్లు ఇందులో ఉన్నారు. ఈ ఘటనలో విమానానికి, ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదని జెట్ ఎయిర్ వేస్ ఓ ప్రకటనలో తెలిపింది. ఘటనపై ద్విసభ్య కమిటీ విచారణ జరుపుతోందని తెలిపింది.