: అఖ్నూర్ లో అనుమానిత వ్యక్తుల సంచారం.. సైన్యం గాలింపు
పాకిస్థాన్ ఉగ్రవాదులు చేసిన యూరీ దాడికి ప్రతీకారంగా ఇటీవల భారత సైన్యం పీవోకేలోకి ప్రవేశించి ఉగ్రవాద శిబిరాలపై చేసిన లక్షిత దాడులతో పాకిస్థాన్, భారత్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన సంగతి తెలిసిందే. ఎటువైపు నుంచి పాకిస్థాన్ దాడులకు తెగబడినా వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టడానికి భారత్ క్షేత్రస్థాయిలో అన్ని ఏర్పాట్లు చేసుకుంది. అనుమానిత వ్యక్తులపై దేశ వ్యాప్తంగా నిఘా ఉంచి వారిపై చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో ఈరోజు ఉదయం జమ్ముకశ్మీర్ లోని అఖ్నూర్ సెక్టార్‌లో అనుమానిత వ్యక్తుల సంచారం జరిగినట్లు సైన్యం సమాచారం అందుకుంది. అక్కడి జౌరియన్ ప్రాంతంలో వారి కదలికలు ఉన్నట్లు తెలుసుకుంది. దీంతో పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టింది.