: విజయవాడలో రోడ్డు ప్రమాదం.. కేశినేని ట్రావెల్ బస్ నిర్లక్ష్యానికి యువకుడు బలి


విజయవాడలోని ఏలూరు రోడ్ సీతారామాపురం వంతెన వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం పాలయ్యాడు. కేశినేని ట్రావెల్స్‌కు చెందిన బస్సు బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో భవానీసాయి అనే యువకుడు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. ఆఫీసులో పని ముగించుకుని సీతారామాపురం వైపు సిగ్నల్ క్రాస్ చేస్తున్న సమయంలో అతి వేగంగా వచ్చిన బస్సు సాయిని ఢీకొట్టింది. దాదాపు 200 మీటర్ల వరకు యువకుడిని ఈడ్చుకెళ్లింది. ప్రమాదంపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు, బాధిత కుటుంబ సభ్యులు బస్సును రోడ్డుపై నిలిపివేశారు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలంటూ రోడ్డుపై బైఠాయించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న కేశినేని ట్రావెల్స్ యాజమాన్యం వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేసింది. అయితే బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు బస్సును కదలనిచ్చేది లేదని స్థానికులు తేల్చి చెప్పడంతో బస్సులోని ప్రయాణికులను దించేశారు. బస్సు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు బస్సును పోలీస్ స్టేషన్‌కు తరలించారు. డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని పోలీసులు చెబుతున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News