: పారా ఒలింపిక్స్ విజేత దీపా మాలిక్ తో అమర్యాదగా ప్రవర్తించిన విమాన సిబ్బంది
విస్తారా ఎయిర్ లైన్స్ సిబ్బంది తనతో అవమానకరంగా ప్రవర్తించారంటూ పారా ఒలింపిక్స్ లో రజత పతక విజేత దీపా మాలిక్ ఆరోపించారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేసింది. ముంబయి-ఢిల్లీ ‘విస్తారా’ విమానంలో నిన్న ఆమె ప్రయాణించింది. అయితే, ఈ విమానం 45 నిమిషాల పాటు ఆలస్యమైంది. ఈ విషయాన్ని తాను తన తల్లికి చెబుతున్న సమయంలో విమాన సిబ్బంది తనతో అమర్యాదకరంగా ప్రవర్తించారని దీపా మాలిక్ ఆరోపించారు. తాను ఫోన్ లో మాట్లాడటంపై వారు అభ్యంతరం వ్యక్తం చేశారని, ‘స్వీట్ హార్ట్, చిల్’ అన్నారంటూ ‘విస్తారా’కు ఆమె రాతపూర్వకంగా ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా, వికలాంగులను ఏ విధంగా హ్యాండిల్ చేయాలనే విషయంపై ‘విస్తారా’కు అసలు అవగాహనే లేదని, వీల్ ఛైర్ లో ఉన్నవారిని విమానం సీటులో ఏ విధంగా కూర్చోబెట్టాలనే కనీస అవగాహన కూడా లేదని ఆమె విమర్శించారు. తనను విమానం సీటులో కూర్చోబెట్టని సిబ్బంది ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ నిలబడిపోయారని, తనకు సాయం చేసేందుకు ఏ ఒక్కరూ ముందుకు రాలేదని దీపా మాలిక్ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆమె వరుస ట్వీట్లు సంధించింది. కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రి థావర్ చంద్ గెహ్లాట్ కు కూడా ఈ ట్వీట్లను ట్యాగ్ చేశారు.