: యువతి ఆడిన కిడ్నాప్ డ్రామా.. ప్రియుడు, అతని స్నేహితుడ్ని జైలుకి పంపించిన వైనం!


ఒక యువతి ఆడిన కిడ్నాప్ డ్రామా ఆమె బాయ్ ఫ్రెండ్, అతని స్నేహితుడ్ని జైలుకి పంపించిన ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. దీని వివరాల్లోకి వెళ్తే... బెంగళూరులోని ఆదర్శ్ పీయూ కళాశాలలో పీయూసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న తన కుమార్తె అర్ధరాత్రి దాటుతున్నా ఇంటికి చేరలేదంటూ ఓ మహిళ పోలీసులను ఆశ్రయించింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా, తెల్లవారుజామున రెండున్నర గంటలకు సదరు యువతి చేతికి గాయంతో ఇల్లు చేరుకుంది. ఇంత వరకు ఎక్కడికెళ్లావని ఆ తల్లి యువతిని నిలదీయడంతో గుడికి వెళ్లి వస్తున్న తనను ఇద్దరు యువకులు రిజిస్ట్రేషన్ నెంబరు ప్లేటు లేని ఇన్నోవా వాహనంలో కిడ్నాప్ చేసి, మారుమూల జనసంచారం లేని ప్రాంతానికి తీసుకువెళ్లి అత్యాచారయత్నం చేశారని వివరించింది. దీంతో దర్యాప్తు చేసిన పోలీసులు ఫర్హాన్ అహ్మద్ (18), సందీప్ సేన్ (18) అనే యువకులను అదుపులోకి తీసుకుని వారిపై ఐపీసీ 363 సెక్షన్ కింద కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపారు. విచారణలో వారు చెప్పిన విషయాలు విన్న పోలీసులు విస్తుపోయారు. అప్పుడు యువతిని నిలదీయడంతో... కిడ్నాప్, రేప్ అంతా డ్రామా అని చెప్పింది. ఫర్హాన్ అహ్మద్ తన బాయ్ ఫ్రెండ్ అని, తామిద్దరం గత రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నామని తెలిపింది. తన తల్లి తనకు 18 ఏళ్లు నిండగానే వివాహం చేయాలనుకుంటోందని, అందుకే తానే ఫర్హాన్ ను సంతోషిమాత దేవాలయం వద్దకు రమ్మన్నానని చెప్పింది. దీంతో ఫర్హాన్ తన స్నేహితుడితో కలిసి స్కూటరుపై 10.20 గంటలకు రాగా, వారితో కలిసి తాను అతని గ్యారేజ్ కు వెళ్లానని, అక్కడే తెల్లవారుజామున రెండు గంటల వరకు ఉన్నానని చెప్పింది. తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు తన తల్లి అడుగుతుందని తెలిసే చేతికి గాయం చేసుకుని, కిడ్నాప్, రేప్ డ్రామా ఆడానని తెలిపింది. దీంతో వారి వాట్స్ యాప్, ఫోన్ సంభాషణలు, వారు తిరిగిన ప్రాంతాలు అన్నీ ఫోన్ ద్వారా సంపాదించిన పోలీసులు, ఆమె చెప్పింది వాస్తవమని గుర్తించారు. అయితే కేసు విత్ డ్రా చేసుకునేందుకు యువతి తల్లి నిరాకరించడంతో తల్లిదండ్రుల అనుమతి లేకుండా బాలికను తీసుకువెళ్లారంటూ సదరు యువకులపై కేసు మార్చామని పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News