: కేజ్రీవాల్ ఆ మాట అనలేదంటున్న ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి
పాక్ ఆక్రమిత కశ్మీర్ లో భారత సైనికులు నిర్వహించిన సర్జికల్ దాడులకు సంబంధించిన ఆధారాలను బయటపెట్టాలంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారన్న వార్తలు సంచలనం సృష్టిస్తున్నాయి. అధికార బీజేపీ నేతలు ఈ వ్యవహారంపై బహిరంగంగానే మండిపడుతున్నారు. మీడియా కూడా ఈ విషయంపై పుంఖానుపుంఖాలుగా వార్తలను ప్రచురిస్తోంది. అయితే, ఈ కథనాల్లో వాస్తవం ఏ మాత్రం లేదని ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా తెలిపారు. గోవాలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఆధారాలు అన్న పదమే కేజ్రీవాల్ ఉపయోగించలేదని... పాక్ మీడియాలో వస్తున్న తప్పుడు కథనాలపై స్పందించాలని మాత్రమే కోరారని సిసోడియా తెలిపారు. సర్జికల్ దాడులకు సంబంధించి ప్రధాని మోదీని అభినందిస్తూ ఓ వీడియో సందేశాన్ని కూడా కేజ్రీవాల్ విడుదల చేశారని చెప్పారు. మన సైనికులు ఎంతో ధైర్య సాహసాలతో పాక్ లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు నిర్వహించారని... దేశ భద్రత కోసం సైనికులు వారి ప్రాణాలను సైతం పణంగా పెట్టారని కొనియాడారు.