: ఇటు కూతురుకి అనారోగ్యం.. అటు క్రికెట్టు.. క్లిష్ట పరిస్థితిని ఎదుర్కున్న క్రికెటర్!
ఇటు తన గారాల కూతురుకి జ్వరం.. అటు తన ‘ఆట’పై బాధ్యత.. ఎటువైపు మొగ్గుచూపాలంటే ఏమని చెబుతాం? దీనికి సమాధానంగా తన ప్రాణానికి ప్రాణమైన ఆ రెండింటిపైన గెలిచి తన ప్రేమ, బాధ్యతను నిరూపించుకున్నాడు టీమిండియా క్రికెటర్, ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ. న్యూజిలాండ్ తో జరిగిన సెకండ్ టెస్ట్ లో భారత్ జట్టు ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నెల 1వ తేదీన రెండో రోజూ ఆట ముగిసే సమయానికి తన కూతురికి జ్వరం వచ్చిందన్న సంగతి షమీకి తెలిసింది. ఆ మ్యాచ్ సమయంలో షమీ గారాల కూతురుకు తీవ్ర జ్వరం, శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది తలెత్తడంతో ఐసీయూలో చేర్పించాల్సి వచ్చింది. ఇటువంటి క్లిష్ట సమయంలో షమీ తనదైన నిర్ణయం తీసుకున్నాడు. ప్రతిరోజూ ఐసీయూలో ఉన్న తన కూతురి వద్దకు వెళ్లి కాసేపు కూర్చుని, తిరిగి మ్యాచ్ ప్రారంభమయ్యే సమయానికి షమీ గ్రౌండ్ కు చేరుకునేవాడు. కూతురిపై ఉన్న ప్రేమను, ఆటపై తనకు ఉన్న నిబద్ధతను చాటుకున్న షమీపై ప్రశంసల వర్షం కురుస్తోంది.