: భారత్ లోని తమ స్నేహితుడు వస్తాడంటూ పాక్ చిన్నారుల ఎదురుచూపులు.. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న ఫోటో!
యూరీ దాడికి ప్రతీకారంగా భారత సైన్యం నియంత్రణ రేఖదాటి పీవోకేలో ఉగ్రవాదులను హతమార్చిన నేపథ్యంలో పాక్, ఇండియా మధ్య ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. దీంతో పాక్ ఇండియాపై దుష్ప్రచారం చేయడం, సర్జికల్ దాడులపై ఆధారాలు బయటపెట్టాలన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను హీరోగా చేసి కథనాలు ప్రచురించడం చూస్తూనే ఉన్నాం. మరోవైపు ఇండియాలోనూ అన్ని వర్గాల నుంచి పాక్ చర్యలపై వ్యతిరేకత తెలుపుతున్నారు. ఈ పరిస్థితుల్లో తాజాగా ఓ ఫేస్‌బుక్ పోస్ట్ సోషల్ మీడియాలో ఎంతోమంది మనసులను గెలుచుకుంటోంది. భారత్, పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతంలో నివసిస్తున్న ఇద్దరు పాకిస్థాన్ చిన్నారులు, భారత్‌లోని మరో చిన్నారి స్నేహితులు. ఇరు దేశాలకు మధ్య ఉన్న నది ఆవల పాక్ చిన్నారులు, ఇటువైపు భారత్ కు చెందిన బాలుడు ఉండేవారు. సాయంత్రం పూట మన సరిహద్దులోని బాలుడు నదిలోకి రాళ్లు విసురుతూ ఒంటరిగా ఆడుకునే వాడు. నదికి అటువైపున పాక్ చిన్నారులు ఇద్దరు కూడా అలాగే నదిలోకి రాళ్లు విసురుతూ ఆడుకునేవారు. వీరు ముగ్గురూ ఎప్పుడూ కలుసుకోకపోయినా ఇలా నదిలో రాళ్లు విసురుతూ ఆడుకుంటూ మౌనంగానే స్నేహాన్ని కొనసాగించారు. కనీసం ఒకరి పేర్లు మరొకరికి తెలియవు. అయితే, కొన్ని రోజులుగా ఇరు దేశాల మధ్య యుద్ధ పరిస్థితులు నెలకొన్న దృష్ట్యా భారత్‌కు చెందిన బాలుడు నది వైపు వెళ్లడం లేదు. అయితే పాక్ నుంచి సదరు ఇద్దరు బాలురు మాత్రం తమ స్నేహితుడు నదివైపుగా వస్తాడంటూ ఎదురు చూస్తూ నిలబడ్డారు. ఈ నేపథ్యంలో పాక్ బాలురు ఇద్దరూ అలా ఎదురు చూస్తుండగా తీసిన ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో అందరినీ కలచివేస్తోంది.