: భారత్ కు ఊరట... మార్షల్స్ ఐలాండ్స్ కేసును తోసిపుచ్చిన ఐరాస కోర్టు


అణ్వస్త్రాల అభివృద్ధిని ఆపడం లేదంటూ భారత్, పాక్, బ్రిటన్ దేశాలపై మార్షల్స్ ఐలాండ్స్ వేసిన కేసును విచారణకు స్వీకరించేందుకు ఐక్యరాజ్యసమితి అత్యున్నత న్యాయస్థానం బుధవారం నాడు నిరాకరించింది. ఈ కేసు విచారణ ఐరాస పరిధిలో లేదంటూ భారత్ లేవనెత్తిన అభ్యంతరాల ఆధారంగా, కేసులో ముందుకు సాగలేమని జస్టిస్ రోనీ అబ్రహాం 'హేగ్ అంతర్జాతీయ న్యాయస్థానాని'కి స్పష్టం చేశారు. 1968 నాటి అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందానికి ఈ దేశాలు తూట్లు పొడుస్తున్నాయని ఆరోపిస్తూ, దాదాపు 50 వేల మంది మార్షల్స్ ద్వీప వాసులు కోర్టుకెక్కిన సంగతి తెలిసిందే. ఇక ఇదే కేసులో ప్రతివాదులుగా ఉన్న పాకిస్థాన్, ఇంగ్లండ్ ల విషయంలోనూ న్యాయస్థానం ఎలా వ్యవహరిస్తుందన్నది వేచి చూడాలి. కాగా, ఈ కేసులో చైనా, ఫ్రాన్స్, ఇజ్రాయెల్, నార్త్ కొరియా, రష్యా, అమెరికా దేశాలు ప్రతివాదులుగా ఉండగా, ఈ దేశాలన్నీ న్యాయస్థానం పరిధిలోకి తాము రామని చెప్పి వాదిస్తూ, తప్పించుకున్నాయి. అదే వాదనను ఇప్పుడు ఇండియా కూడా వినిపించి తప్పించుకోవడం గమనార్హం. 1946 నుంచి 1958 మధ్య కాలంలో అమెరికా 67 అణు బాంబులను మార్షల్స్ దీవుల్లో పరీక్షించేందుకు నిర్ణయించి, దీవుల్లోని ప్రజలందరినీ ఇతర ప్రాంతాలకు తరలించింది. 1954లో 'బ్రావో' పేరిట తయారైన హైడ్రోజన్ బాంబును ఇక్కడ పరీక్షించి చూసింది. హిరోషిమాపై వేసిన అణుబాంబుతో పోలిస్తే ఇది 1000 రెట్లు ప్రమాదకారి.

  • Loading...

More Telugu News