: సోషల్ మీడియాలోకి పవన్ కల్యాణ్ ‘జనసేన’.. యూట్యూబ్ ఛానెల్ కూడా ప్రారంభం
గత సార్వత్రిక ఎన్నికల ముందు స్థాపించిన పవన్ కల్యాణ్ ‘జనసేన’ పార్టీ తాజాగా సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చింది. ఫేస్‌బుక్, ట్విట్టర్‌లో అధికారికంగా ఖాతాలు తెరిచింది. అంతేకాదు, యూట్యూబ్ ఛానెల్‌ను కూడా ప్రారంభించింది. జనసేన పార్టీకి సంబంధించిన పూర్తి సమాచారం, అజెండా, వీడియోలు సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు తెలియజేయనుంది. ఇటీవలే పవన్ కల్యాణ్ తాను కొత్తగా రచిస్తోన్న ‘నేను-మనం-జనం’ పుస్తకం ద్వారా పార్టీ సిద్ధాంతాలను ప్రజల ముందుకు తీసుకువస్తానని చెప్పిన విషయం తెలిసిందే. సోషల్ మీడియా ద్వారా మరింతగా ప్రజల్లోకి వెళ్లాలని జనసేన యోచిస్తోంది. ప్రజలు అధిక సంఖ్యలో సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నారు. అన్ని రాజకీయ పార్టీలు సోషల్ మీడియాలో చేసే పోస్టింగుల ద్వారా పార్టీ కార్యకలాపాలను, నాయకుల పర్యటన వివరాలను తెలుపుతున్నాయి. అదే దారిలో తేలికగా ప్రజల్లోకి తమ కార్యకలాపాలను తెలియజేయడానికి జనసేన సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటికే పవన్ కల్యాణ్ దేశ, రాష్ట్ర రాజకీయాలపై ట్విట్టర్‌లో తన వ్యక్తిగత ఖాతా ద్వారా స్పందిస్తున్నారు.