: సర్జికల్ దాడి ఫుటేజీని కేంద్రానికి అందించిన ఆర్మీ
తాము పీవోకేలోని ఉగ్రస్థావరాలపై జరిపిన లక్షిత దాడుల ఆధారాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని ఆర్మీ ఈరోజు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, కేంద్రం నుంచి అనుమతి రావాలని చెప్పింది. తమ వద్ద ఉన్న దాడులకు సంబంధించిన వీడియోలను ఆర్మీ కొద్ది సేపటి క్రితం కేంద్రానికి అప్పగించింది. వాటి విడుదలపై కేంద్ర సర్కారు ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. పీవోకేలో జరిపిన సర్జికల్ దాడుల ఆధారాలను బయటపెట్టాలని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తో పాటు పలువురు ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు. అయితే, ఆ అవసరం లేదని వెంకయ్యనాయుడు ఈరోజు ప్రకటించారు. మరోవైపు పాకిస్థాన్ కూడా ఆధారాలు చూపించాలంటూ పేర్కొంది. కేంద్రం వీడియోను విడుదల చేస్తుందా? లేదా? అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.