: దావూద్ ఇబ్రహీంతో కలసి పనిచేసిన గుట్కా సామ్రాజ్య అధినేతలు 'మాణిక్ చంద్' ధరివాల్, 'గోవా' జోషి: సీబీఐ సంచలన ప్రకటన


'మాణిక్ చంద్' బ్రాండ్ పేరిట దేశవ్యాప్తంగా గుట్కా ఉత్పత్తుల సామ్రాజ్యాన్ని విస్తరించిన రసిక్ లాల్ ధరివాల్, 'గోవా' బ్రాండ్ గుట్కా యజమాని జగదీష్ జోషిలు అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంతో కలసి పనిచేశారని, ఆయనతో 'పరస్పర ప్రయోజన బంధం' నడిపారని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) సంచలన ప్రకటన చేసింది. దాదాపు పది సంవత్సరాల పాటు వీరి కదలికలపై నిఘా పెట్టి, దావూద్ తో వీరి బంధాన్ని వెలికి తీసినట్టు పేర్కొంటూ ఈ మేరకు చార్జ్ షీట్ ను ఫైల్ చేసింది. పాకిస్థాన్ లో దావూద్ సోదరుడు అనీస్ ఇబ్రహీం ఓ గుట్కా ఫ్యాక్టరీని పెట్టడానికి వీరు సహకరించి ధన ప్రయోజనం పొందారని తెలిపింది. ఇదే చార్జ్ షీట్ లో దావూద్ పేరును నిందితుల్లో ఒకడిగా చేర్చిన సీబీఐ, ఆయన మేనల్లుడు అబ్దుల్ హమీద్ అంతులే, దావూద్ అనుచరుడు సలీమ్ మొహమ్మద్ గుహాస్ షేక్ పేర్లనూ చేర్చింది. వాస్తవానికి 2004లో పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో ధరివాల్, జోషిల పేర్లు లేవు. ఆపై విచారణలో వీరి ప్రమేయం వెలుగులోకి వచ్చిందని తెలిపింది. ఇక చార్జ్ షీట్ కాపీలను ధరివాల్ తరఫు న్యాయవాది సిద్ధార్థ లూత్రా, జోషీ తరఫు న్యాయవాది గణేష్ గోలేలకు విడివిడిగా అందిస్తూ, వీరిద్దరూ 'కేసు పదేళ్ల నాటిదే అయినా, ఎప్పటికీ చట్టం నుంచి తప్పించుకోలేరు' అని వ్యాఖ్యానించడం గమనార్హం. 1996 నుంచి ధరివాల్ కు, దావూద్ కు పరిచయం ఉందని, దావూద్ కు చెందిన గోల్డెన్ బాక్స్ ట్రేడింగ్ కు గుట్కా ఉత్పత్తులను సరఫరా చేశాడని, 1996-2001 మధ్య రూ. 100 కోట్ల విలువైన ఉత్పత్తులు ఇచ్చి, రూ. 35 కోట్ల లాభాన్ని ఆర్జించాడని సీబీఐ పేర్కొంది. ఆపై ధరివాల్, జోషీల మధ్య విభేదాలు రాగా, సెటిల్ మెంట్ కోసం దావూద్ ను ఆశ్రయించారని, తన కంపెనీలో రూ. 250 కోట్ల విలువైన వాటాలు ఇస్తానని దావూద్ కు జోషీ హామీ ఇచ్చి, ఆపై మాట తప్పాడని సీబీఐ తెలిపింది. ధరివాల్ కరాచీ వెళ్లి దావూద్ ను కలసి వచ్చాడని తెలిపింది. గుట్కా పౌచ్ లు తయారు చేసే నైపుణ్యమున్న వ్యక్తి కిడ్నాప్ కేసులో జోషికి ప్రమేయముందని వెల్లడించింది.

  • Loading...

More Telugu News