: మూడు దశాబ్దాలుగా పార్టీ కోసం పాటుపడితే... తీసేయడం క్రమశిక్షణా?: విజయవాడ బీజేపీ నేత ఉమామహేశ్వరరాజు
మూడు దశాబ్దాలుగా పార్టీ కోసం అవిశ్రాంతంగా పని చేసిన తనను నేటి ఉదయం అకస్మాత్తుగా సస్పెండ్ చేయడం సరైన చర్యా? అని విజయవాడ నగర బీజేపీ అధ్యక్షుడు ఉమమహేశ్వరరాజు ప్రశ్నించారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, విజయవాడలో పార్టీ వేళ్లూనుకోని రోజుల్లో కేవలం నాలుగు ఓట్ల మెజారిటీతో డివిజన్ నేతగా విజయం సాధించానని అన్నారు. తరువాత ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధించానని ఆయన చెప్పారు. తనపై లేనిపోని ఆరోపణలు చేసిన విజయవాడ నగర బీజేపీ ప్రధాన కార్యదర్శి జమ్మూ శ్యాం కిషోర్ మాటలు నమ్మి తనపై సస్పెన్షన్ విధించడం సరికాదని రాష్ట్ర అధ్యక్షుడికి తెలిపారు. తాను సెలెక్టెడ్ అధ్యక్షుడ్ని కాదని, ఎలెక్టెడ్ అధ్యక్షుడినని ఆయన అన్నారు. అలాంటి తనను తీసేస్తాం, ఏకపక్షంగా సస్పెండ్ చేస్తామనడం సరి కాదని ఆయన చెప్పారు. ఏపీకి కొత్త అధ్యక్షుడు ఎన్నికైన తరువాత ఆయన ఆదేశాల ప్రకారం పని చేస్తానని ఆయన తెలిపారు. డివిజన్ అధ్యక్షులంతా కలిసి తనను ఎన్నుకున్నారని, అవసరమైతే తమను రాజీనామా చేయాలని కోరుతున్నారని ఆయన వెల్లడించారు. పార్టీ అధిష్ఠానానికి చాలా సార్లు మెయిల్స్ పంపానని, పార్టీ కార్యకర్తల మనోభావాలు దెబ్బతినకుండా చూడాల్సిన బాధ్యత తమ అందరిపై ఉందని ఆయన చెప్పారు. అలా చూడలేని పక్షంలో పార్టీకి దెబ్బతగులుతుందని ఆయన హెచ్చరించారు.