: కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పొగిడిందని మహిళా ఉద్యోగిని సస్పెండ్ చేసిన బీజేపీ ప్రభుత్వం!
హర్యానా రాష్ట్రాన్ని గతంలో పరిపాలించిన భూపీందర్ సింగ్ హుడా ప్రభుత్వాన్ని ప్రశంసిస్తూ, సమాచార హక్కు చట్టం కింద వచ్చిన ఓ ప్రశ్నకు సమాధానాన్ని పంపిన మహిళా ఉద్యోగినికి ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం షాకిచ్చింది. ఆమెను సస్పెండ్ చేస్తున్నట్టు తెలిపింది. తప్పుడు సమాచారం, వ్యాఖ్యలు చేసిందంటూ ఆమెపై పోలీసు కేసు పెట్టేందుకు మనోహర్ లాల్ ఖట్టర్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. పరిశ్రమలు, వాణిజ్య శాఖ విభాగంలో ఉన్నతాధికారిగా పనిచేస్తున్న సునీతా దేవి, ఓ ఆర్టీఐ దరఖాస్తుకు సమాధానం ఇస్తూ, ఇప్పుడు పాలిస్తున్న ప్రభుత్వంతో పోలిస్తే, గత ప్రభుత్వం ఉద్యోగాల కల్పన విషయంలో మెరుగ్గా ఉందని చెప్పడమే ఆమె చేసిన తప్పు. దీంతో ఖట్టర్ సర్కారు ఇరకాటంలో పడగా, ఇప్పుడు ఆమెపై చార్జ్ షీట్ దాఖలు చేయనున్నట్టు హర్యానా అధికార వర్గాలు వెల్లడించాయి.