: వడ్డీ రేటు తగ్గే కాలం... ఊహించని విధంగా పావు శాతం తగ్గిన రెపో రేటు
ఎవరూ ఊహించని విధంగా తన తొలి పరపతి సమీక్షలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ ఉర్జిత్ పటేల్ రెపో రేటును పావు శాతం తగ్గిస్తున్నట్టు ప్రకటించారు. గత రెండు రోజులుగా ఆర్బీఐ పరపతి సమీక్ష నిర్వహించిన ఆయన, కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడుతూ వడ్డీ రేట్లను తగ్గించాలని నిర్ణయించినట్టు తెలిపారు. రెపో రేటును (ఆర్బీఐ నుంచి బ్యాంకులు తీసుకునే నిధులపై వసూలు చేసే వడ్డీ) ప్రస్తుతమున్న 6.50 శాతం నుంచి 6.25 శాతానికి తగ్గిస్తున్నట్టు తెలిపారు. వ్యవస్థలో రుణ లభ్యత పెరగడం, మరింత తక్కువ వడ్డీలకు రుణాలు లభించి ఆర్థిక వృద్ధి దిశగా దేశం సాగేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని భావిస్తున్నట్టు ఆయన వెల్లడించారు. 6.25 శాతం రెపో రేటు ఆరేళ్ల కనిష్ఠం కావడం గమనార్హం. టోకు ధరల సూచి ఆధారిత ద్రవ్యోల్బణం తగ్గినందునే వడ్డీ రేట్లను కూడా తగ్గించాలని నిర్ణయించామని, వెంటనే బ్యాంకులు స్పందించి అన్ని రకాల రుణాలపై వసూలు చేస్తున్న వడ్డీ రేట్లను తగ్గించాలని ఉర్జిత్ పటేల్ కోరారు. 2017 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం 5.3 శాతంగా ఉండవచ్చని అంచనా వేస్తున్నట్టు వివరించారు. రివర్స్ రెపో రేటు (ఆర్బీఐ వద్ద బ్యాంకులు దాచుకునే నిధులపై ఇచ్చే వడ్డీ) కూడా పావు శాతం తగ్గి 5.75 శాతం వద్ద కొనసాగుతుందని వివరించారు. కాగా, తదుపరి పరపతి సమావేశం డిసెంబర్ 6, 7 తేదీల మధ్య జరగనుంది.