: ఉదయం తిరుపతిలో... సాయంత్రం హైదరాబాద్ కు... మర్నాడు తిరుపతికి... కారణం చెప్పిన చంద్రబాబు
ఆదివారం ఉదయం తిరుపతిలో ఉన్న చంద్రబాబునాయుడు సాయంత్రానికి హైదరాబాద్ వచ్చి తిరిగి సోమవారం మధ్యాహ్నం తరువాత తిరుపతికే బయలుదేరి వెళ్లారు. 24 గంటల వ్యవధిలో తిరుపతి హైదరాబాద్ మధ్య రెండు సార్లు ప్రయాణానికి కారణాన్ని ఆయన, టీటీడీపీ నేతలతో భేటీ అయిన వేళ స్వయంగా వెల్లడించారు. పండితులు వారించిన మీదటే తాను అనుకోకుండా హైదరాబాద్ రావాల్సి వచ్చిందని చెప్పారు. "ఆదివారం ఉదయం అధికారిక పర్యటనలో భాగంగా తిరుపతి వెళ్లాను. సోమవారం నాడు తిరుమల శ్రీవారికి పట్టు వస్త్రాలు ఇవ్వాల్సి వున్నందున అక్కడే ఉండి పోవాలని అనుకున్నాను. కానీ ఆగమ పండితులు వారించారు. మరో పని నిమిత్తం వచ్చి, శ్రీవారికి వస్త్రాలు సమర్పించరాదని, స్వామికి ద్వితీయ ప్రాధాన్యం ఇవ్వకూడదని చెప్పారు. అందుకే హైదరాబాద్ వచ్చి రాత్రికి ఉండి వెళుతున్నాను" అని వివరణ ఇచ్చారు.