: పారా ఒలింపిక్స్ విజేతలకు సచిన్ ఆర్థిక సాయం.. ఘనంగా సన్మానం
రియోలో జరిగిన పారా ఒలింపిక్స్‌లో విజయాలు సాధించిన పలువురు అథ్లెట్లను దిగ్గజ మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఘనంగా సత్కరించి తనవంతు ఆర్థికసాయాన్ని అందించాడు. ముంబైలో సోమవారం జరిగిన కార్యక్రమంలో పారా ఒలింపిక్ విజేతలైన దేవేంద్ర ఝఝారియా(స్వర్ణం-జావెలిన్ త్రో), మరియప్పన్ తంగవేలు(స్వర్ణం-హైజంప్), దీప మాలిక్(రజతం-షాట్‌పుట్), వరుణ్ సింగ్ భాటి(కాంస్యం-హైజంప్)లకు రూ.15 లక్షల చొప్పున చెక్‌లు అందించారు. వీరితో పాటు ఇంతకుముందు ప్రకటించినట్టు గతంలో జరిగిన పారా ఒలింపిక్స్ విజేతలైన మురళీకాంత్ పట్రేకర్(1972), భీంరావు కేస్కర్, జోగిందర్ సింగ్ బేడీ(1984), రాజేందర్ సింగ్ రహేలు(2014), హెచ్ఎన్ గిరీషా(2012)లు కూడా రూ.15 లక్షలు చొప్పున చెక్‌లు అందుకున్నారు. ఇందుకోసం సచిన్ టెండూల్కర్, హైదరాబాద్ జిల్లా బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షుడు చాముండేశ్వరీనాథ్, నిమ్మగడ్డ ప్రసాద్, కొల్లి రవికుమార్, డాక్టర్ ఆజాద్ మూపెన్, సంజయ్ ఘోడ్వాట్, అభయ్ గాడ్గిల్ తమవంతు సాయం అందించారు.