: పాక్‌ను ఒంటరి చేసే వ్యూహం.. రిపబ్లిక్ డే వేడుకలకు అబుదాబి యువరాజుకు ఆహ్వానం అందుకే!


ఉరీ ఉగ్రదాడి తర్వాత పాక్‌ను అన్ని రకాలుగా ఏకాకిని చేసేందుకు భారత్ చేస్తున్న వ్యూహాలు ఫలిస్తున్న తరుణంలో దాయాదికి భారత్ మరో ఝలక్ ఇచ్చింది. ఈసారి గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా అబుదాబి యువరాజు షేక్ మహ్మద్ బిన్ జయద్‌ను ఆహ్వానించడం ద్వారా ప్రధాని మోదీ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. సాధారణంగా గణతంత్ర వేడుకలకు దేశాధినేతలను ఆహ్వానించడం సంప్రదాయంగా వస్తోంది. అయితే ఈసారి దానిని పక్కనపెట్టి అబుదాబి యువరాజు బిన్ జాయద్‌ను ఆహ్వానించారు. తద్వారా అరబ్ దేశాల వ్యవహారాల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఆయన కుటుంబానికి మోదీ అత్యంత గౌరవం ఇచ్చినట్టు అయింది. దుబాయ్, అబుదాబి సహా ఐదు ఎమిరేట్ల సమాఖ్యకు అబుదాబి రాజకుటుంబం అధ్యక్షుడిగా వ్యవహరిస్తోంది. ప్రస్తుతం అబుదాబి రాజుగా ఉన్న షేక్ ఖలీఫా అనారోగ్యం పాలవడంతో కీలకమైన అంతర్జాతీయ వ్యవహారాలన్నీ ఆయన సోదరుడు, యువరాజు షేక్ మహమ్మద్ చూస్తున్నారు. అమెరికా అధ్యక్షుడిని సైతం పెద్దగా పట్టించుకోరని పేరున్న జాయద్‌కు మోదీతో మాత్రం సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఫిబ్రవరిలో జాయద్ భారత్‌లో పర్యటించినప్పుడు ప్రొటోకాల్‌ను పక్కనపెట్టి మరీ ప్రధాని ఆయనకు నేరుగా స్వాగతం పలికారు. కాగా ప్రస్తుతం పాకిస్థాన్‌తో వాతావరణం హాట్‌హాట్‌గా ఉన్న నేపథ్యంలో రిపబ్లిక్ డే ఉత్సవాలకు అబుదాబి రాజును ఆహ్వానించడం ద్వారా పాక్‌ను దౌత్యపరంగా ఒంటిరిని చేసే ప్రయత్నాలను మరింత ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News