: వేతనాల స్థాయిలోనే అద్దెలు.. వెలగపూడి వెళ్లేందుకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వెనకడుగు!
విజయవాడ, వెలగపూడి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోని ఇంటి అద్దెలు ఆంధ్రప్రదేశ్ సచివాలయం, హెచ్‌వోడీల్లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. దీంతో ఏపీకి వెళ్లేందుకు వారు వెనకడుగు వేస్తున్నారు. ప్రభుత్వం ఇటీవల వేతనాలు పెంచినప్పటికీ, తమ వేతనాల స్థాయిలోనే ఇక్కడి అద్దెలు ఉన్నాయంటూ వాపోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చి పనిచేయడం కంటే ఉద్యోగం నుంచి తప్పుకోవడం మేలంటూ దాదాపు 30 శాతం మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం 13 వేలమంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఏపీ సచివాలయం, హెచ్‌వోడీల్లో పనిచేస్తున్నారు. వీరిలో 70 శాతం మంది నూతన రాజధానికి వచ్చేందుకు ఇష్టపడుతుండగా మరో 30 శాతం మంది అద్దెల భయంతో ఆసక్తి చూపడం లేదు. మరోవైపు ఏపీ స్థానికత కలిగిన ఉద్యోగులు కూడా ఈ విషయంలో వెనకడుగు వేస్తున్నారు. అయితే కాంట్రాక్ట్ ఉద్యోగులందరూ బెజవాడ వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. తరలింపు విషయంలో ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ ఉద్యోగులపై ఎటువంటి ఒత్తిడి లేదని ప్రభుత్వాధికారులు తెలిపారు. తరలింపు పూర్తయ్యాక వీలైనంత త్వరగా కొత్తగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను భర్తీ చేసేందుకు ప్రయత్నిస్తామని పేర్కొన్నారు.