: భారత్ పై దుష్ప్రచారానికి పాక్ కొత్త వ్యూహం ఇదే...బయటపెట్టిన బలూచ్ నేత
భారత్ పై విషం చిమ్మేందుకు పాకిస్థాన్ ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) సరికొత్త వ్యూహం అమలు చేస్తోందని బలూచిస్థాన్ నేత హర్ బ్యార్ మార్రీ తెలిపారు. భారతదేశంపై విషం చిమ్మేందుకు పాకిస్థాన్ ఐఎస్ఐ సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకోవడంలో భాగంగా, సమారు 5 వేల ఫేక్ అకౌంట్లను సృష్టించిందని ఆయన తెలిపారు. ఈ ఫేక్ అకౌంట్ల ద్వారా ప్రపంచ నేతలతో పాటు బలూచ్ నేతల ఫొటోలను దుర్వినియోగం చేస్తోందని ఆయన ఆరోపించారు. స్మార్ట్ ఫోన్లలో అందుబాటులో ఉండే సోషల్ మీడియా లక్ష్యంగా పాక్ భారతదేశంపై విష ప్రచారానికి పాల్పడుతోందని ఆయన చెప్పారు. తన ఫోటోలను కూడా ఈ ఫేక్ అకౌంట్లలో వాడుకుందని ఆయన తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదానికి నిధులిస్తూ ప్రోత్సహిస్తున్న ఐఎస్ఐ నేరపూరిత కుట్రను అంతా గుర్తించాలని ఆయన హెచ్చరించారు. భారత్ పై విద్వేషం జల్లేందుకు పాకిస్థాన్ ప్రధానంగా బలూచ్ ప్రజల ఇంటి పేర్లను సామాజిక మాధ్యమాల్లో వాడుకుంటోందని ఆయన తెలిపారు. భారతదేశంపై అవమానకరమైన భాషను బలూచ్ నేతలు ఎన్నడూ ఉపయోగించబోరని ఆయన తెలిపారు. అయితే అవమానకరమైన భాషతో బలూచ్ ప్రజల ఇంటిపేరుతో పాకిస్థాన్, దాని కీలు బొమ్మలు భారీ ఎత్తున దుష్ప్రచారం నిర్వహిస్తున్నాయని ఆయన మండిపడ్డారు.