: జయలలిత ఆసుపత్రిలో ఉన్న వేళ... 'టీమ్ ఆఫ్ 6' చేతుల్లో పాలన!


తీవ్ర అనారోగ్యం బారినపడిన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, 13 రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, ఆమెకు అత్యంత నమ్మకస్తులైన ఆరుగురు సభ్యుల బృందం పాలనా పగ్గాలు చేపట్టినట్టు ఏఐఏడీఎంకే వర్గాలు వెల్లడించాయి. గత శనివారం నాడు గవర్నర్ విద్యాసాగర్ రావు ఆమెను పరామర్శించి వచ్చి, అమ్మ ఆరోగ్యం కుదుటపడుతోందని చెప్పిన తరువాత ఆమె ఆరోగ్యంపై వస్తున్న వదంతులు కొద్దిగా తగ్గినప్పటికీ, ఇంకా ఎన్ని రోజులు ఉండాలన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో పాలన గాడి తప్పకుండా చూసేందుకు, 54 ప్రభుత్వ విభాగాల పర్యవేక్షణను ఆరుగురు తమ భుజస్కంధాలపై వేసుకున్నారు. వీరిలో జయలలిత నిచ్చెలి శశికళా నటరాజన్, ఆమెకు దీర్ఘకాల నమ్మినబంటు, చీఫ్ సెక్రటరీ షీలా బాలకృష్ణన్, అనుకోని పరిస్థితులు ఏర్పడితే, సీఎం పీఠం ఎక్కి, ఆపై అమ్మ రాగానే నమ్మకంగా పదవిని అప్పగించే సీనియర్ నేత పన్నీర్ సెల్వమ్ కీలకులని పార్టీ వర్గాలు వెల్లడించాయి. వీరితో పాటు ఆమె ఏరికోరి నియమించుకున్న సీఎంఓలో కార్యదర్శులు ముగ్గురు ఈ టీమ్ లో ఉన్నారని, మరే ఇతర మంత్రికి కూడా నిర్ణయాధికారాలు లేవని తెలిపాయి. కాగా, ఆమెకు రక్తనాళాల్లో ఇన్ఫెక్షన్ సోకగా, ఈ రకం రుగ్మతకు ప్రపంచంలోనే పేరున్న బ్రిటన్ వైద్యుడిని తమిళనాడు ప్రభుత్వం రప్పించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News