: మెగాస్టార్, పవర్ స్టార్ లపై ‘పోసాని’ ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ తను చెప్పదలచుకున్న విషయాన్ని స్పష్టంగా, కుండబద్దలు కొట్టినట్లు ప్రముఖ రచయిత, నటుడు పోసాని కృష్ణమురళి చెబుతాడనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పోసాని తనదైన శైలిలో మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘చిరంజీవి చాలా నిజాయతీ పరుడు. ఎందుకంటే, గతంలో నాకు ప్రజారాజ్యం పార్టీ సీటు ఇచ్చినపుడు ఒక్క రూపాయి కూడా నా దగ్గర తీసుకోలేదు. అయితే, నేను డబ్బులు ఖర్చు పెట్టలేకపోవడం వల్లే నాడు ఓడిపోయాను’ అని పోసాని నాటి విషయాలను గుర్తు చేసుకున్నారు. చిరంజీవి తన ప్రజారాజ్యం పార్టీని మళ్లీ ప్రారంభిస్తే కనుక ఆయన వెంట నడవడానికి తాను మళ్లీ సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ఈ సందర్భంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి ప్రశ్నించగా.. ఒక వ్యక్తి గురించి తాను మాట్లాడాలంటే, ఆ వ్యక్తి నిజాయతీ పరుడైనా అయిఉండాలి, లేదా, చెడ్డ వ్యక్తిత్వం గలవాడైనా అయి ఉండాలి అంటూ సూటిగా సమాధానం చెప్పలేదు. జనసేన పార్టీ గురించి ప్రశ్నించగా.. ఆ పార్టీ గురించి ఇంతవరకూ తనకేమీ అర్థం కాలేదని, అర్థమయ్యాక దీనికి సమాధానం చెబుతానని పోసాని చెప్పుకొచ్చారు.