: జవాన్ల కన్నుగప్పి పారిపోయిన ఉగ్రవాదులు!
నిన్న రాత్రి బారాముల్లా సెక్టార్ లోని 46 రాష్ట్రీయ రైఫిల్స్ హెడ్ క్వార్టర్స్ పై దాడి చేసి, ఓ జవాను మృతికి కారణమైన ఉగ్రవాదులు తప్పించుకుని పారిపోయినట్టు తెలుస్తోంది. ఈ ఆర్మీ సెంటర్ లోకి ముగ్గురు నుంచి నలుగురు ఉగ్రవాదులు చొరబడి ఉండవచ్చని, రెండు గంటల ఎన్ కౌంటర్ అనంతరం కాల్పులు ఆగిపోగా, ఉగ్రవాదుల కోసం సోదాలు నిర్వహిస్తున్నట్టు సైన్యాధికారి ఒకరు తెలిపారు. హంద్వారా వెళ్లే జాతీయ రహదారిని జల్లెడ పడుతున్నట్టు వివరించారు. ఈ ఉగ్రదాడిలో గాయపడిన మరో సైనికుడు ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నారు. ప్రస్తుతం పరిస్థితి నియంత్రణలోనే ఉందని సైనికాధికారి ఒకరు తెలిపారు. ఈ ఉగ్రవాదులు జీలం నది దాటి ప్రయాణించి వచ్చి చొరబడివుంటారని అనుమానిస్తున్నట్టు తెలిపారు. కాగా, బారాముల్లాలో పరిస్థితిపై జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్, హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు వివరించారు. గత వారంలో భారత సైన్యం సరిహద్దులు దాడి వెళ్లి, పీఓకేలో సర్జికల్ స్ట్రయిక్స్ చేసి వచ్చిన తరువాత, ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింతగా పెరిగిన సంగతి తెలిసిందే.