: ఇథియోపియాలో నరమేధం.. పోలీసుల కాల్పుల్లో 300 మంది మృతి
ఇథియోపియాలో పోలీసుల దమనకాండకు ఇది ప్రత్యక్ష ఉదాహరణ. ఆదివారం పోలీసు బలగాలు విచక్షణ రహితంగా జరిపిన కాల్పుల్లో దాదాపు 300 మంది మృత్యువాత పడ్డారు. ఆఫ్రికాలోనే అతిపెద్ద సాంస్కృతిక ఉత్సవం నిర్వహిస్తున్న ఒరోమో ప్రజలపై పోలీసులు హెలికాప్టర్ల నుంచి కాల్పులకు తెగబడ్డారు. కనీసం 295 మంది పౌరులు మృతి చెందారు. వందలాదిమంది గాయపడ్డారు. వర్షాకాలం ముగిసి వసంతకాలంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఒరోమో ప్రావిన్స్‌లో ఇరీచా అనే వేడుకను ఆనందోత్సాహాల మధ్య నిర్వహించుకుంటారు. ఇథియోపియోలోని పదికోట్ల మంది జనాభాలో అత్యధిక శాతం ఈ ప్రావిన్సులోనే నివసిస్తారు. ఇక్కడి ఫెడరల్ ప్రభుత్వం వీరి హక్కులను కాలరాస్తుండడంతో ప్రజలు ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నారు. చాలాకాలంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. దీంతో ప్రభుత్వం వీరిని దారుణంగా అణచివేస్తోంది. గత 11 నెలలుగా ప్రభుత్వ దమనకాండ పెచ్చుమీరడంతో వీరు నిరసను ఉద్ధృతం చేశారు. కాగా ఈ ఉత్సవంలో ప్రభుత్వ వ్యతిరేకత వ్యక్తమవుతుందని, ప్రజలు నిరసన ప్రదర్శనలు చేస్తారని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తుతారని భావించిన ప్రభుత్వం శనివారం నుంచే పెద్ద ఎత్తున అరెస్టులకు తెరలేపింది. ఆదివారం ఏకంగా కాల్పులకు తెగబడింది. కాల్పుల నుంచి తప్పించుకునేందుకు ప్రజలు ప్రయత్నించడంతో తొక్కిసలాట జరిగింది. దీనివల్లే ఎక్కుమంది చనిపోయి ఉంటారని స్థానికులు చెబుతున్నారు. కాల్పుల విషయాన్ని అంగీకరించిన ఫెడరల్ ప్రభుత్వం మృతుల సంఖ్యను వెల్లడించలేదు.