: బంధువే కదా అని నమ్మినందుకు యువతిని కాటేసిన బావ.. అది చూసి మరో ఇద్దరు కూడా అఘాయిత్యం
బంధువే కదా అని నమ్మి వెంట వెళ్లిన యువతిపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. అది చూసిన మరో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు కూడా ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. కాజీపేట రైల్వేస్టేషన్ సమీపంలో ఆదివారం రాత్రి జరిగిందీ ఘటన. కాజీపేట పోలీసుల వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా దుబ్బాక మండలం అప్పనపల్లికి చెందిన యువతి హైదరాబాద్లో ఉంటూ ఓ ప్రైవేటు పాఠశాలలో పనిచేస్తోంది. కరీంనగర్ జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం మల్యాలకు చెందిన పొన్నం అంజయ్య(30) ఆమెకు వరసుకు బావ అవుతాడు. మొన్న హైదరాబాద్ వచ్చిన అంజయ్య పనిలోపనిగా యువతి ఇంటికి వెళ్లి పలకరించాడు. ఆయన తోడుగా ఉంటాడన్న నమ్మకంతో మల్యాలలో ఉండే తన బంధువులను చూసి వచ్చేందుకు యువతి బయలుదేరింది. ఇద్దరూ కలిసి సికింద్రాబాద్లో రైలెక్కి రాత్రి పదిన్నర గంటల సమయంలో కాజీపేట చేరుకున్నారు. అయితే మల్యాల వెళ్లేందుకు కాజీపేట టౌన్ స్టేషన్కు వెళ్లాల్సి ఉంటుందంటూ ఆమెను పక్కనే ఉన్న స్టేషన్కు పట్టాల వెంట నడిపించుకుంటూ తీసుకెళ్లాడు. స్టేషన్ సమీపంలోకి వస్తున్న సమయంలో ఆమెపై బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. వీరిని చూసిన మరో ఇద్దరు యువతిని బెదిరించి ఒకరితర్వాత ఒకరుగా అత్యాచారం చేశారు. అనంతరం వారి చెరనుంచి తప్పించుకున్న బాధితురాలు కాజీపేట పోలీస్ స్టేషన్కు చేరుకుని ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసుల నిందితుల కోసం గాలిస్తున్నారు.