: ఆర్మీ క్యాంపుపై ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడి.. బారాముల్లాలో భీకర కాల్పులు.. ఒక జవాను వీరమరణం
ఉగ్రవాదులు తమ బుద్ధి మార్చుకోలేదు. మెరుపుదాడులతో వారి వెన్నులో వణుకుపుట్టించినా తమ తోకవంకరను ఎప్పటికీ సరిచేయలేరని నిరూపించారు. తాజాగా బారాముల్లా జిల్లాలోని ఆర్మీ క్యాంపుపై ఉగ్రవాదులు ఆదివారం మరోమారు ఆత్మాహుతిదాడికి తెగబడ్డారు. రాత్రి సుమారు గంటలు 8:30 సమయంలో ఓ పబ్లిక్ పార్కు గుండా 46 రాష్ట్రీయ రైఫిల్స్ క్యాంపులోకి చొరబడేందుకు ఉగ్రవాదులు విఫలయత్నం చేశారు. తుపాకులతో కాల్పులు జరిపారు. దీంతో జవాన్లు ఎదురు కాల్పులు ప్రారంభించారు. హోరాహోరీగా జరిగిన ఈ కాల్పుల్లో ఓ జవాను వీరమరణం పొందాడు. మరో ఇద్దరు సైనికులు గాయపడ్డారు. అలాగే భారత జవాన్ల ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. మరోవైపు జమ్ము జిల్లాల్లోని పల్లన్వాలా సెక్టార్లో పాక్ సైనికులు మరోమారు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. నియంత్రణ రేఖ వెంబడి కాల్పులు, పేలుళ్లు జరిపారు.